టైం వేస్ట్ వద్దు.. సీరియస్‌గా చదవండి
● నేటి నుంచి ప్రీ ఫైనల్ పరీక్షలు
● ఇంటర్ విద్యార్థులకు
డీఐఈఓ రవీందర్‌రెడ్డి సూచన
సిద్దిపేటఎడ్యుకేషన్: వార్షిక పరీక్షలు సమీపిస్తున్న వేళ ఇంటర్మీడియెట్ విద్యార్థులు టైం వేస్ట్ చేయకుండా సీరియస్‌గా పరీక్షలకు సన్నద్ధం కావాలని జిల్లా ఇంటర్ విద్యాధికారి(డీఐఈఓ) రవీందర్‌రెడ్డి సూచించారు. తెలంగాణ గెజిటెడ్ లెక్చరర్స్ అసోసియేషన్ నాయకులు స్థానిక కార్యాలయంలో డీఐఈఓను కలిసి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపి పలు సమస్యలపై చర్చించారు. ఈ సందర్భంగా రవీందర్‌రెడ్డి మాట్లాడుతూ జిల్లాలోని అన్ని జూనియర్ కళాశాలల్లో దాదాపు సిలబస్ పూర్తయిందని, ఇంటర్నల్ పరీక్షలు సైతం నిర్వహించి జవాబు పత్రాలను మూల్యాంకనం చేసి మార్కులు నమోదు చేసినట్లు చెప్పారు. శనివారం నుంచి మొదటి ప్రీ ఫైనల్ పరీక్షలు నిర్వహిస్తున్నామని విద్యార్థులు తప్పని సరిగా పరీక్షలకు హాజరు కావాలన్నారు. ఈ నెల 21న ఫస్టియర్‌కు, 22న సెకండియర్ విద్యార్థులకు ఇంగ్లిష్ ప్రాక్టికల్ పరీక్షలు ఉంటాయన్నారు. విద్యార్థులు సమయం ఎంతో విలువైనదని దానిని వృధా చేసుకోకుండా పరీక్షలకు చక్కని ప్రణాళికతో సన్నద్ధం కావాలన్నారు. అధ్యాపకులు ప్రత్యేక దృష్టి సారించి విద్యార్థులను పరీక్షలకు ప్రిపేర్ చేయించాలన్నారు. ఈ సంవత్సరం ఉత్తమ ఫలితాలు సాధించేందుకు ప్రిన్సిపల్స్, అధ్యాపకులు, సిబ్బంది సమన్వయంతో పనిచేయాలన్నారు. విధి నిర్వహణలో అలసత్వం వహిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. కార్యక్రమంలో తెలంగాణ గెజిటెడ్ లెక్చరర్స్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు కనకచంద్రం, రాష్ట్ర అధికార ప్రతినిధి నంట శ్రీనివాస్‌రెడ్డి, జిల్లా ప్రధానకార్యదర్శి దరిపలి నగేష్, ప్రచార కార్యదర్శి వెంకటరమణ తదితరులు పాల్గొన్నారు.


