కొంగొత్త ఆశలతో.. కొత్త ఏడాదిలోకి | - | Sakshi
Sakshi News home page

కొంగొత్త ఆశలతో.. కొత్త ఏడాదిలోకి

Jan 1 2026 1:47 PM | Updated on Jan 1 2026 1:47 PM

కొంగొత్త ఆశలతో.. కొత్త ఏడాదిలోకి

కొంగొత్త ఆశలతో.. కొత్త ఏడాదిలోకి

జిల్లా వాసులకు శుభాకాంక్షలు తెలిపిన ప్రజాప్రతినిధులు, అధికారులు

కొంగొత్త ఆశలు.. కొత్త ఆశయాలతో జిల్లా వాసులు 2026 సంవత్సరానికి స్వాగతం పలికారు. గతేడాది మిగిల్చిన జ్ఞాపకాలు, సరికొత్త లక్ష్యాలతో కొత్త సంవత్సరంలోకి అడుగుపెట్టారు. ఈ నేపథ్యంలో ప్రజాప్రతినిధులు, అధికారులు జిల్లా వాసులకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. గతేడాది సాధించిన విజయాలు, ఈ ఏడాది నిర్దేశిత లక్ష్యాలను సాక్షితో పంచుకున్నారు. వెల్లడించిన అంశాలు.. వారి మాటల్లోనే.. – సాక్షి, సిద్దిపేట

నూతన సంవత్సర వేడుకల్లో భాగంగా సూర్యాస్తమయ వేళ కోమటి చెరువులో బోటు షికారు చేస్తూ యువతుల కేరింతలు

ఎడ్యుకేషన్‌ పాలసీ తీసుకువస్తా..

నేషనల్‌ ఎడ్యుకేషన్‌ పాలసీని రాష్ట్రంలో పూర్తిగా అమలు అయ్యేందుకు కృషి చేస్తా. పాఠశాల విద్య పదో తరగతి అయిపోగానే చదువును చాలా మంది ఆపివేస్తున్నారు. ఇంటర్‌ నుంచి పీజీ వరకు తక్కువ మంది విద్యార్థులు చదువుతున్నారు. ప్రతి ఔట్‌సోర్సింగ్‌ ఉద్యోగికి రూ25లక్షల ఇన్సూరెన్స్‌ చేసే విధంగా ప్రభుత్వం పై ఒత్తిడిని తీసుకవస్తాను. విద్య, వైద్యంపై ప్రత్యేక దృష్టి పెడతా.

– చిన్నమైల్‌ అంజిరెడ్డి,

ఎమ్మెల్సీ

అన్ని రంగాల్లో అభివృద్ధికి కృషి

అందరి సహకారంతో జిల్లా అన్ని రంగాల్లో ముందుండే విధంగా అభివృద్ధికి కృషి చేస్తాను. ప్రభుత్వ అమలు చేస్తున్న అన్ని సంక్షేమ పథకాలు అర్హులకు చేరే విధంగా చూస్తాను. కొత్త సంవత్సరంలో ఇందిరమ్మ ఇళ్ల పంపిణీ ద్వారా సొంతింటి కల నెరవేరేలా కృషి చేస్తాను. జిల్లా ప్రజలు అందరూ సంతోషంగా ఉండాలని దేవున్ని ప్రార్థిస్తున్నా. అందరికి హ్యాపీ న్యూ ఇయర్‌.

– హైమావతి, కలెక్టర్‌

సరికొత్త ఆలోచనలతో ముందుకు సాగాలి

కొత్త సంవత్సరంలో సరికొత్త ఆలోచనలు, ఆశయాలు, లక్ష్యాలతో ముందుకు సాగి.. లక్ష్యాలను చేరుకోవాలి. నూతన సంవత్సరంలో ప్రతి ఒక్కరి ఇంటా సంతోషాలు వెల్లివిరియాలి. ప్రతి ఒక్కరూ ఆనందకరమైన జీవితం గడపాలని కోరుకుంటున్నా. ముఖ్యంగా విద్యార్థులు, యువత, నూతన లక్ష్యాలు ఎంచుకుని వాటిని చేరుకునేలా ప్రణాళికతో ముందుకు సాగాలి. కొత్త సంవత్సరంలో అందరికీ శుభం కలగాలని కోరుకుంటూ హ్యాపీ న్యూ ఇయర్‌.

– తన్నీరు హరీశ్‌ రావు, మాజీ మంత్రి, ఎమ్మెల్యే

గౌరవెల్లితో సాగు నీటిని అందిస్తా..

గౌరవెల్లి రిజర్వాయర్‌కు అనుబంధంగా కాలువలు నిర్మించి సాగు నీటిని అందించి మూడు పంటలు పండేలా కృషి చేస్తా. హుస్నాబాద్‌లో ప్రారంభమైన అభివృద్ధి పనులు త్వరగా పూర్తి చేయిస్తా. సర్వాయి పాపన్న నాలెడ్జ్‌ సెంటర్‌ను ఏర్పాటు చేస్తాను. హుస్నాబాద్‌ నియోజకవర్గానికి ట్రీపుల్‌ఐటీ బ్రాంచ్‌ను, నవోదయ వచ్చేందుకు నా వంతు కృషి చేస్తా. కొత్త ఏడాదిలో అందరూ సుఖ సంతోషాలతో జీవించాలని దేవున్ని ప్రార్థిస్తున్నా. – పొన్నం ప్రభాకర్‌ గౌడ్‌,

రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి

కాలువల నిర్మాణానికి కృషి

దుబ్బాక నియోజకవర్గం తొగుటలో ఉన్న మల్లన్నసాగర్‌ రిజర్వాయర్‌ ఇతర ప్రాంతాలకు సాగు, తాగు నీటిని అందిస్తోంది. కానీ దుబ్బాక నియోజకవర్గంలో కాలువల నిర్మాణం లేకపోవడంతో సాగు నీరు అందడం లేదు. మల్లన్నసాగర్‌ నుంచి దుబ్బాక నియోజకవర్గంలోని గ్రామాలకు కాలువల నిర్మాణం చేయించేందుకు కృషి చేస్తాను. దుబ్బాక పట్టణం రింగ్‌ రోడ్‌, వెజ్‌ నాన్‌వెజ్‌ మార్కెట్‌ నిర్మించేందుకు ప్రభుత్వంతో కోట్లాడి నిధులు తీసుకువస్తా. ఎన్నికల్లో ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేరుస్తా

– కొత్త ప్రభాకర్‌ రెడ్డి,

ఎమ్మెల్యే ,దుబ్బాక

రోడ్డు ప్రమాదాల నివారణే లక్ష్యం

రోడ్డు ప్రమాదాల నివారణ కోసం వాహనదారులకు అవగాహన కల్పిస్తాను. రోడ్డు ప్రమాదాలను తగ్గించి, ప్రమాదాల్లో చనిపోకుండా కంట్రోల్‌ చేస్తాను. అలాగే సైబర్‌ క్రైంపై ప్రజల్లో మరింత అవగాహన పెంచి కట్టడికి కృషి చేస్తాను. ప్రజలకు పారదర్శకంగా సేవలు అందించేందుకు జిల్లా పోలీస్‌ కృషి చేస్తోంది.

– విజయ్‌ కుమార్‌, సీపీ

ఉద్యాన పంటలను విస్తరిస్తా..

రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యాన పంటలు విస్తరించేందుకు కృషి చేస్తాను. అలాగే యూనివర్సిటీ ద్వారా కొత్త వంగడాల కోసం పరిశోధనలు చేపిస్తాను. ఉద్యాన పంటలపై విస్తృతంగా అవగాహన కల్పిస్తాను. పంటల సాగులో రసాయన మందుల వినియోగం తగ్గించాలి.

– డి.రాజిరెడ్డి, వీసీ,

కొండాలక్ష్మణ్‌ ఉద్యాన యూనివర్సిటీ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement