విభేదాలు వీడుదాం.. సమష్టిగా సాగుదాం
ప్రశాంత్‌నగర్(సిద్దిపేట): జిల్లాలో కాంగ్రెస్ పార్టీ పటిష్టతకు అందరం సమష్టిగా కృషి చేస్తూ ఉత్తమ ఫలితాలు సాధిద్దామని డీసీసీ అధ్యక్షురాలు ఆంక్షారెడ్డి అన్నారు. విభేదాలు వీడుదాం.. గతం వదిలేద్దామన్నారు. ఓబీసీ సెల్ జిల్లా అధ్యక్షుడు, ఆర్టీఏ జిల్లా మెంబర్ సూర్యవర్మ బుధవారం తన నివాసంలో ఆంక్షా రెడ్డిని ఘనంగా సన్మానించారు. అంతకుముందు జిల్లా కేంద్రంలోని ఇందిరా గాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి, బైక్ ర్యాలీ ద్వారా సూర్యవర్మ ఇంటికి చేరుకున్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ పార్టీ కోసం ఇష్టంగా పనిచేయాలన్నారు. మాజీ సీఎం కేసీఆర్ ఇలాకాలో 94 మంది సర్పంచ్ లను గెలిపించుకున్నామన్నారు. ఇది కాంగ్రెస్ పార్టీకి శుభసూచికమన్నారు. సిద్దిపేటలో జెడ్పీటీసీ, ఎంపీటీసీ, మున్సిపల్ ఎన్నికల్లో కలిసికట్టుగా పని చేసి ఉత్తమ ఫలితాలు సాధిద్దామన్నారు. అంతకుముందు సూర్యవర్మ మాట్లాడుతూ యూత్ కాంగ్రెస్ నుంచి జిల్లా అధ్యక్షురాలిగా ఆంక్షారెడ్డి ఎన్నికకావడం సంతోషంగా ఉందన్నారు. అనంతరం పార్టీ శ్రేణులు ఆమెను గజమాలతో ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు చంద్రశేఖర్, పాండు, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.
కాంగ్రెస్ పటిష్టతే లక్ష్యం కావాలి
డీసీసీ అధ్యక్షురాలు ఆంక్షారెడ్డి


