
ఓటరూ మేల్కోండి.. మార్పులు సరిచేసుకోండి
● సవరణ కోసం దరఖాస్తు చేసుకోవాలి ● కలెక్టర్ హైమావతి ● వివిధ రాజకీయ పార్టీల నాయకులతో సమావేశం
సిద్దిపేటరూరల్: గ్రామ పంచాయతీల్లో ప్రదర్శించిన ఓటరు జాబితాపై ఎలాంటి సందేహాలు, మార్పులు, చేర్పులున్నా దరఖాస్తు చేసుకోవాలని కలెక్టర్ హైమావతి సూచించారు. గ్రామ పంచాయతీ ఎన్నికల సన్నాహాల్లో భాగంగా శుక్రవారం కలెక్టరేట్‌లోని కాన్ఫరెన్స్ హాల్‌లో వివిధ రాజకీయ పార్టీ ప్రతినిధులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలోని 508 గ్రామపంచాయతీల్లో 6,55,958 మంది ఓటర్లు ఉన్నారు. ఓటర్ల జాబితాను గ్రామ పంచాయతీల్లో ప్రదర్శించామన్నారు. జాబితాపై ఎలాంటి సందేహాలు ఉన్నా పంచాయతీల్లో, ఎంపీడీఓ కార్యాలయంలో దరఖాస్తు చేసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో డీపీఓ దేవకీదేవి, వివిధ పార్టీల నాయకులు తదితరులు పాల్గొన్నారు.
నిర్మాణాల్లో నాణ్యత తప్పనిసరి
పనుల జాతర కార్యక్రమంలో భాగంగా చేపట్టిన నిర్మాణ పనుల్లో నాణ్యత ప్రమాణాలు పాటిస్తూ నిర్ణీత సమయంలో పూర్తి చేయాలని కలెక్టర్ హైమావతి పంచాయతీరాజ్ ఇంజనీరింగ్ శాఖ అధికారులను ఆదేశించారు. శుక్రవారం జిల్లా గ్రామీణాభివృద్ధి శాఖ, ఈజీఎస్ ద్వారా చేపడు తున్న పనులపై సంబందిత శాఖల అధికారులతో కలెక్టర్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ జీపి భవనాలు, అంగన్వాడీ సెంటర్ల పనులను వెంటనే ప్రారంభించాలన్నారు.
‘ఆ గ్రామంలోనే ఉంచండి’
ఓటరు లిస్టుపై అభ్యంతరాలు
అక్కన్నపేట(హుస్నాబాద్): ‘మేమంతా భూ నిర్వాసితులం.. రామవరం గ్రామంలో ఓటు హక్కును వినియోగించుకునేలా చూడాలని కోరుతూ ఎంపీడీఓ కార్యాలయ సూపరింటెండెంట్ శంకరయ్యకు శుక్రవారం వినతిపత్రం అందజేశారు. పలువురు మాట్లాడుతూ గత అసెంబ్లీఎన్నికల్లో తమ ఓటు హక్కును రామవరంలోని వినియోగించుకున్నామన్నారు. ఇటీవల ఓటరు లిస్టులో సేవలాల్ మహరాజ్ తండాలో చేర్చారన్నారు.