
వానొస్తే వణుకే..
● వరదొస్తే జలదిగ్బంధమే ● రియల్ ‘దందా’తో ఎక్కడికక్కడా నాలాల మూసివేత ● పాలకుల పట్టింపులేనితనమే కారణం ● గజ్వేల్–ప్రజ్ఞాపూర్ మున్సిపాలిటీ దుస్థితి
గజ్వేల్: భారీవర్షాలొస్తే మున్సిపాలిటీ వరద ముప్పుతో వణికిపోతుంది. నాలుగు రోజులుగా కురుస్తున్న వర్షాలతో పలు కాలనీలు నీటమునిగాయి. ప్రధాన రహదారిపై రాకపోకలు నిలిచిపోయాయి. జనం తీవ్ర అవస్థలు పడ్డారు. పట్టణంలో ఉన్న నాలాల వ్యవస్థ ఎక్కడికక్కడా మూసుకుపోవడంతో ఈ దుస్థితి నెలకొంది. అధికారుల పట్టింపులేనితనంతో ఈ సమస్య జఠిలంగా మారుతోంది. ఈ సమస్య పరిష్కారానికి కొన్నేళ్ల కిందట రూ.14 కోట్లతో ప్రతిపాదనలు పంపినా ఆమోదం కరువైంది. భారీ వరదలతో గజ్వేల్–ప్రజ్ఞాపూర్ మున్సిపాలిటీ పరిధిలోని ఆయా వార్డుల్లోని లోతట్టు కాలనీల ప్రజలు అవస్థలు పడుతున్నారు. ప్రధానంగా ప్రజ్ఞాపూర్ ఊర చెరువు మత్తడి దుంకితే.. ఆ నీరు వెళ్లడానికి అవసరమైన నాలాల వ్యవస్థ లేదు. వాస్తవానికి నాలాల ద్వారా రాజిరెడ్డిపల్లి కుంటలోకి వరద వెళ్లాల్సి ఉంది. కానీ నీరు వెళ్లే మార్గం లేక ఇళ్ల మధ్య నుంచే వెళ్తోంది. ఈ క్రమంలో పార్ధివేశ్వరస్వామి ఆలయం ఆర్చి వద్ద జలమయంగా మారుతోంది. ఆ రోడ్డు పక్కన డ్రైనేజీ వ్యవస్థను నిర్మించినా పూర్తి స్థాయిలో తరలిపోయే విధంగా నిర్మాణం జరగలేదు. ప్రస్తుతం కురిసిన వర్షాలకు గజ్వేల్–ప్రజ్ఞాపూర్ ప్రధాన రహదారి 2కిలోమీటర్ల మేర జలమయంగా మారింది. వరద ఉధృతికి గంటలతరబడి వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి.
రూ.12కోట్లతో ప్రతిపాదనలు పంపినా..
సమస్య పరిష్కారానికి గతంలో ప్రధాన రహదారి కింది భాగంలో ఓ అండర్ బ్రిడ్జిని నిర్మించాలనుకున్నా.. పెండింగ్‌లో పెట్టారు. మరోవైపు రోడ్డుకు ఇరువైపులా ఉన్న అండర్ డ్రైనేజీ గుండా వరద వేళ్లే విధంగా ప్రత్యేక నిర్మాణాలను చేపట్టాల్సి ఉంది. ఇందుకోసం రూ.12కోట్లతో ప్రతిపాదనలున్నా.. ఆమో దం లభించలేదు. అదేవిధంగా ఎర్రకుంట నుంచి పాండవుల చెరువు ఫీడర్ ఛానెల్ నిర్మాణానికి మరో రూ.2కోట్లతో ప్రతిపాదనలు సిద్ధం చేశారు. కానీ ఈ ప్రతిపాదనలకు మోక్షం కరువైంది. మున్సిపాలిటీ పరిధిలో దశాబ్ధాల కాలంగా ఉన్న వరదనీటి కాలువ వ్యవస్థ రియల్ ‘దందా’ వల్ల పూర్తిగా కనుమరుగైంది. అక్రమ ప్లాట్లలో నిర్మాణాలను మున్సిపల్ అధికారులు అనుమతులు కూడా ఇచ్చేశారు. నీటిపారుదల శాఖ ఏనాడూ కాల్వలు ఆక్రమణకు గురవుతున్నా ఎలాంటి చర్యలు చేపట్టలేదు. ఫలితంగా చినుకువస్తే చాలా కాలనీలు చెరువులను తలపిస్తున్నాయి.