బోనస్ ఏమాయో? | - | Sakshi
Sakshi News home page

బోనస్ ఏమాయో?

Aug 13 2025 7:44 AM | Updated on Aug 13 2025 7:48 PM

Farmers who sold their crops

సన్నాలు విక్రయించిన రైతులు ఎదురుచూపులు

కొనుగోళ్లు ముగిసి రెండు నెలలైనా అందని డబ్బు 

3 వేల మందికి  రూ.6.84కోట్ల బకాయిలు 

త్వరగా చెల్లించాలని కోరుతున్న రైతులు 

ధాన్యం కొనుగోళ్లు ముగిసి రెండు నెలలు గడిచినా ఇంత వరకు ప్రభుత్వం బోనస్‌ చెల్లించలేదు. వానాకాలం సీజన్‌లో పెట్టుబడికి ఉపయోగపడుతుందని భావించిన రైతులకు నిరాశే ఎదురైంది. జిల్లా వ్యాప్తంగా వరి నాట్లు చివరి దశకు చేరుకున్నాయి. వానాకాలం పంటల సాగు పెట్టుబడి పెరిగింది. దీనికి తోడు ఎరువుల ధరలు పెరగడంతో తిప్పలు తప్పడంలేదు. బోనస్‌ త్వరగా చెల్లించి సహకరించాలని రైతులు కోరుతున్నారు.

సాక్షి, సిద్దిపేట: యాసంగిలో 92,954 మంది రైతుల నుంచి 3,81,402 మెట్రిక్‌ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేశారు. ఇందుకు సంబంధించిన డబ్బులు రూ. 884.53కోట్లను చెల్లించారు. వాటిలో 13,682.320 మెట్రిక్‌ టన్నుల సన్న ధాన్యం ఉన్నాయి. యాసంగి నుంచి ప్రభుత్వం సన్న ధాన్యం క్వింటాల్‌కు రూ.500లు బోనస్‌ అందజేస్తోంది. 3,162 మంది రైతులకు రూ.6,84,11,600 బోనస్‌ చెల్లించాలి. సన్నరకం వైపు మొగ్గు చూపిన రైతులకు సకాలంలో బోనస్‌ డబ్బులు రాకపోవడంతో ఆవేదన చెందుతున్నారు.

రైతులకు భారం

ఇప్పటికీ బోనస్‌ డబ్బులు రాకపోవడంపై రైతులు ఆందోళనకు గురవుతున్నారు. బోనస్‌ ఇస్తారా? ఇవ్వరా? అన్న సందిగ్ధత నెలకొంది. ప్రభుత్వం మాట విని బోనస్‌కు ఆశపడి సన్నాలు సాగుచేస్తే ఈ రకంగా ఇబ్బంది పెట్టడం సరైంది కాదని రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అప్పులు తీసుకొచ్చి పెట్టుబడి పెట్టామని, బోనస్‌ పైసలు ఆలస్యం కావడంతో వడ్డీల భారం పడుతున్నదని ఆందోళన వ్యక్తంచేస్తున్నారు. రెండు రోజుల్లోనే ధాన్యం పైసలు ఖాతాల్లో జమ చేస్తామని చెప్పిన ప్రభుత్వం.. మూడు నెలలైనా బోనస్‌ బకాయిలు ఎందుకు ఇవ్వడం లేదని మండిపడుతున్నారు.

ఆలస్యంతో వెనుకడుగు!

ప్రభుత్వం బోనస్‌ వెంటనే చెల్లించకపోవడంతో రైతులు సన్నాల సాగుకు వెనుకంజ చేస్తున్నట్లు తెలుస్తోంది. ప్రభుత్వం రేషన్‌ దుకాణాల ద్వారా సన్న బియ్యం పంపిణీ చేస్తుండటంతో తప్పనిసరిగా సన్నరకం ధాన్యానికి డిమాండ్‌ ఉంటుందని రైతులు భావిస్తున్నారు. కానీ బోనస్‌ చెల్లించడం ఆలస్యం అవుతుండటంతో ఈ సారి వానాకాలంలో పలువురు సన్నాల సాగుకు వెనుకడుగు వేస్తున్నారు.

బోనస్‌ జాడలేదు

ఈ ఫొటోలో కనిపిస్తున్న రైతు రాచబోయిన అంజగౌడ్‌, ఇతనిది వర్గల్‌ మండలం మైలారం గ్రామం. 1.5 ఎకరాల్లో సన్న వడ్లు సాగు చేశారు. 34 బస్తాల వడ్లు దిగుబడి వచ్చింది. జూనన్‌ 2న మైలారం కొనుగోలు కేంద్రంలో తూకం వేయగా 13.6 క్వింటాళ్లు ఉన్నట్లు తక్‌ పట్టి ఇచ్చారు. క్వింటాల్‌కు రూ.500 బోనస్‌ లెక్కన రూ.7వేలు రావాలి. రెండు నెలలు దాటినా రాలేదు. డబ్బులు వస్తే పెట్టుబడికి ఉపయోగపడుతాయని, వెంటనే చెల్లించాలని అంజగౌడ్‌ కోరుతున్నారు.

ఎవరిని అడిగినా..

యాసంగిలో 90 క్వింటాళ్ల సన్న ధాన్యాన్ని ఐకేపీ సెంటర్‌లో విక్రయించాను. సన్న వడ్లకు బోనస్‌ ఇస్తున్నారని తెలిసి సన్నాలు సాగు చేశా. ఇప్పటికీ బోనస్‌ డబ్బులు రాలేదు. ఏ అధికారిని అడిగినా సమాధానం చెప్పడంలేదు. బోనస్‌ రాకపోవడంతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నా.. –నరేందర్‌, రాంనగర్‌, జగదేవ్‌ పూర్‌

వివరాలు పంపించాం

దొడ్డు ధాన్యానికి సంబంధించిన డబ్బులు అన్ని రైతుల బ్యాంక్‌ ఖాతాల్లో జమ అయ్యాయి. సన్న ధాన్యం ఎంత వచ్చాయో ఆ వివరాలు సైతం పంపించాం. రైతులకు బోనస్‌ డబ్బులు నేరుగా రైతుల బ్యాంక్‌ అకౌంట్‌లలో జమ అవుతాయి.

– ప్రవీణ్‌, డీఎం, సివిల్‌ సప్లయ్‌ కార్పొరేషన్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement