ప్రజాసౌకర్యాలకు ప్రాధాన్యం
‘సిద్దిపేట మున్సిపాలిటీ పరిధిలోని ఆయా వార్డుల్లో ప్రజల అవసరాలకు అనుగుణంగా మౌలిక వసతులు కల్పిస్తాం. అవసరమైతే సమస్యలపై క్షేత్ర స్థాయిలో పర్యటించి సత్వరం పరిష్కారానికి చర్యలు తీసుకుంటాం. ప్రాధాన్యత క్రమంలో రహదారులనూ నిర్మిస్తాం’ అని కమిషనర్ ఆశ్రిత్ కుమార్ తెలిపారు. మంగళవారం మున్సిపల్ కమిషనర్‌తో ఉదయం 11:30 నుంచి 12:30 వరకు ‘సాక్షి’ ఆధ్వర్యంలో నిర్వహించిన ఫోన్ ఇన్‌కు అనూహ్య స్పందన లభించింది. ఈ సందర్భంగా పట్టణ వాసులు కమిషనర్ దృష్టికి పలు సమస్యలు తీసుకువచ్చారు. వాటిని పరిష్కరించాలని కోరారు. ఫోన్ ఇన్ ద్వారా వచ్చిన సమస్యలు, ఫిర్యాదులపై కమిషనర్ స్పందిస్తూ.. ఆయా విభాగాల అధికారులు తక్షణం క్షేత్ర స్థాయిలో పరిశీలించి పరిష్కరించాలని ఆదేశించారు. ప్రధానంగా నూతన కాలనీల్లో మిషన్ భగీరథ నీళ్లు, యూజీడి వ్యవస్థ అమలు, రహదారుల నిర్మాణానికి అత్యధికంగా వినతులు వచ్చాయి.
– సాక్షి సిద్దిపేట/సిద్దిపేటజోన్
కొత్త కాలనీలకు నీళ్లివ్వండి
మా కాలనీలో 20 ఇళ్లు ఉన్నాయి. ఇప్పటివరకు మిషన్ భగీరథ నీరు రావడం లేదు. తాగునీటి కోసం ఇబ్బందులు పడుతున్నాం. భగీరథ పైప్ లైన్ ఏర్పాటు చేసి మంచి నీళ్లు ఇవ్వాలి.
– భూషణం, సాజిద్ అలీ(సద్గురు నగర్, సిద్దిపేట)
మున్సిపల్ కమిషనర్: మున్సిపాలిటీ పరిధిలో కొత్త కాలనీలు వెలిశాయి. అప్పటి నివాసాలకు అనుగుణంగా మిషన్ భగీరథ పైప్‌లైన్ ఏర్పాటు చేశారు. ప్రస్తుతం పెరిగిన నివాసాలకు అనుగుణంగా పైప్ లైన్ పనులు చేపట్టాలని నిర్ణయించాం. త్వరితగతిన భగీరథ నీళ్లు అందిస్తాం
తాగునీటికి ఇబ్బందులు
పలు కాలనీల్లో నీరు సరఫరా సక్రమంగా జరగడం లేదు. తాగునీటికి ఇబ్బందులు ఎదుర్కొంటున్నాం. తక్షణం పరిష్కరించండి
–కోటమ్మ(శివాజీ నగర్), వెంకట్ రమణారెడ్డి (మైత్రి వనం), వెంకయ్య (మోహిన్ పూర)
మున్సిపల్ కమిషనర్: మిషన్ భగీరథ, మానేరు పథకం ద్వారా పట్టణంలో నీటి సరఫరా చేస్తున్నాం. నీటి సరఫరాలో సమస్యలు ఉంటే మా దృష్టికి తెస్తే సత్వరం పరిష్కరిస్తాం. వేసవిలో నీటి సమస్య రాకుండా చర్యలు చేపడుతున్నాం. సంబంధిత అధికారి, సిబ్బంది క్షేత్ర స్థాయిలో పర్యటించి సమస్య పరిష్కరిస్తారు.
రోడ్డు మధ్యలో ఆర్చ్ కట్టారు..
రోడ్డు మధ్యలో ప్రయివేటు వ్యక్తులు కమాన్ (ఆర్చ్) నిర్మించారు. ప్రజలకు ఇబ్బందిగా ఉంది, చర్యలు తీసుకోండి. –శ్రీనివాస్ రెడ్డి(మైత్రి వనం)
మున్సిపల్ కమిషనర్: ప్రభుత్వ స్థలంలో అక్రమంగా నిర్మాణం చేస్తే ఉపేక్షించేది లేదు. టౌన్ ప్లానింగ్ అధికారులు క్షేత్ర స్థాయిలో పరిశీలించి నిబంధనలు ఉల్లంఘించినట్లు తేలితే చర్యలు తీసుకుంటారు.
వసతులు కల్పించండి
మౌలిక వసతులు కల్పించాలి. వి మార్ట్ వెనుక భాగంలో రహదారులు లేవు, యూజీడి వ్యవస్థ అసలే లేదు. చాలా ఇబ్బందులు పడుతున్నాం.
–సంజీవ రెడ్డి, శ్రీనివాస్‌రెడ్డి, లత శేఖర్‌గౌడ్ (మారుతి నగర్)
మున్సిపల్ కమిషనర్: రహదారి. యూజీడి వ్యవస్థ నిర్మాణం కోసం ప్రతిపాదనలు పూర్తి చేసి టెండర్లను పిలిచాం. కాంట్రాక్టర్లు ముందుకు రాలేదు. త్వరితగతిన ప్రక్రియ పూర్తి చేసి సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకుంటాం. యూజీడికి అక్కడ ఔట్ లెట్ లేదు. అయినప్పటికీ సమస్య లేకుండా చూస్తాం.
కాలువలు శుభ్రం చేయాలి
పారిశుద్ధ్య నిర్వహణ సక్రమంగా లేదు. మురికి కాలువలను సరిగ్గా శుభ్రం చేయడం లేదు. రోజు క్లీనింగ్ ఉండేలా చూడాలి. చెత్త బండి సరిగ్గా రావడం లేదు
–వంశీకష్ణ (అంబేడ్కర్ నగర్), శేఖర్(మారుతీ నగర్), లక్ష్మీనారాయణ(చార్వాదాన్ వీధి)
మున్సిపల్ కమిషనర్: పారిశుద్ధ్య నిర్వహణ పనులు సరిగ్గా జరిగేలా చూస్తాం. సిబ్బంది కొరత వల్ల కొన్ని ప్రాంతాల్లో ఇబ్బందులు వస్తున్నాయి. రోజూ చెత్త బండి వచ్చేలా చూస్తాం. సంబంధించిన విభాగం అధికారులు, సిబ్బంది క్షేత్ర స్థాయిలో తనిఖీలు చేసి సమస్యలు లేకుండా చూస్తారు.
మ్యుటేషన్ చేస్తలేరు
నోటరీ ద్వారా మ్యుటేషన్ చేస్తాలేరు. ఆఫీసు చుట్టూ తిరుగుతున్నా సమస్య పరిష్కారం కావడం లేదు. –శ్రీకాంత్(గాంధీనగర్)
మున్సిపల్ కమిషనర్: నోటరీ ఆధారంగా మున్సిపల్ కార్యాలయంలో మ్యుటేషన్ జరగదు. నిబంధనల ప్రకారమే మ్యుటేషన్ చేస్తాం. సంబంధించిన పత్రాలు తీసుకుని నేరుగా కలవండి. సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకుంటాం.
పన్ను విధింపులో తేడాలు
ఆస్తి పన్ను విధింపు విషయంలో తేడాలు తలెత్తుతున్నాయి. ఒకే వార్డులో ఒకే ప్రాంతంలో వేరువేరుగా ట్యాక్స్ విధిస్తున్నారు.
(ప్రవీణ్ రెడ్డి, సిద్దిపేట)
మున్సిపల్ కమిషనర్: భవనం పరిస్థితులు, నిర్మాణం మేరకు మున్సిపల్ ఆస్తి పన్ను విధింపు ఉంటుంది. ట్యాక్స్ విషయంలో ఎలాంటి పొరపాటు జరగకుండా జాగ్రత్తగా కొలతల ప్రకారమే పన్నులు అమలు చేస్తున్నాం.
అధ్వానంగా మ్యాన్‌హోల్స్
మ్యాన్ హోల్స్‌పై కవర్లు లేవు. మైత్రి వనంలో యూజీడీ మ్యాన్ హోల్‌పై కవర్లు లేనందున ఇబ్బందులు పడుతున్నాం. అందులో చెత్త చెదారం పడుతోంది. దుర్వాసన వస్తోంది. రాత్రి వేళల్లో అందులో పడే ప్రమాదం ఉంది. –నాగరాజు(మైత్రి వనం)
మున్సిపల్ కమిషనర్: సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకుంటాం. త్వరితగతిన మ్యాన్ హోల్స్ మీద కవర్లు ఏర్పాటు చేస్తాం. ఇబ్బంది లేకుండా చూస్తాం. యూజీడి అధికారులు క్షేత్ర స్థాయిలో వచ్చేలా ఆదేశాలు జారీ చేస్తా.
దుర్వాసన వస్తోంది
నర్సాపూర్ చెరువు వద్ద మాంసం వ్యర్థాలు బహిరంగంగా పారబోస్తున్నారు. దీంతో దుర్వాసన వస్తోంది. వాకర్స్ చాలా ఇబ్బందులు పడుతున్నారు. సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకోవాలి. –బాబు(సిద్దిపేట)
మున్సిపల్ కమిషనర్: సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకుంటాం. వ్యర్థాలు బహిరంగ ప్రదేశాల్లో వేయకుండా చూస్తాం. గట్టి నిఘా ఏర్పాటు చేస్తాం.
ఫోన్‌లో ఫిర్యాదులు స్వీకరిస్తున్న కమిషనర్ ఆశ్రిత్‌కుమార్
పారిశుద్ధ్యం నిర్వహణపై ప్రత్యేక దృష్టి
రోడ్ల మరమ్మతులను వేగవంతం చేస్తాం
యూజీడి, భగీరథ సమస్యలపై ఫోకస్
మున్సిపల్ కమిషనర్ ఆశ్రిత్ కుమార్
‘సాక్షి’ ఫోన్ ఇన్‌కు అనూహ్య స్పందన
ప్రజాసౌకర్యాలకు ప్రాధాన్యం


