ఆకట్టుకున్న గణిత నమూనాలు
ప్రశాంత్‌నగర్(సిద్దిపేట): జాతీయ గణిత దినోత్సవాన్ని జిల్లా కేంద్రంలోని అన్ని పాఠశాలల్లో సోమవారం ఘనంగా నిర్వహించారు. ప్రముఖ గణితవేత్త రామానుజన్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. విద్యార్థులు కూడికలు, తీసివేత, గుణకారాలు, భాగహారాలు, త్రిభుజాలు, రేఖాగణిత, అల్‌జీబ్రాతో పాటుగా వివిధ రకాల గణిత శాస్త్ర నమూనాలను ప్రదర్శించారు.
సాంఘికశాస్త్ర ల్యాబ్ ఏర్పాటు అభినందనీయం
సిద్దిపేటఅర్బన్: సాంఘిక శాస్త్రం ల్యాబ్ ఏర్పాటు చేయడం అభినందనీయమని, జిల్లా విద్యాధికారి ఎల్లంకి శ్రీనివాస్‌రెడ్డి అన్నారు. సోమవారం సిద్దిపేట అర్బన్ మండలం బక్రిచెప్యాల ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో సాంఘికశాస్త్ర ఉపాధ్యాయుడు మామిడి పూర్ణచందర్‌రావు చొరవతో సాంఘికశాస్త్ర ల్యాబ్ ఏర్పాటు చేశారు. డీఈవో శ్రీనివాస్‌రెడ్డి ల్యాబ్‌ను ప్రారంభించి మాట్లాడారు. జిల్లాలో సాంఘికశాస్త్ర ల్యాబ్ చూడటం ఇదే ప్రథమమని దీని స్ఫూర్తి తో జిల్లాలో సాంఘికశాస్త్ర ల్యాబ్‌లు ఏర్పాటు చేయాలని సూచించారు. విద్యార్థులకు ఇవి ఎంతో ఉపయోగకరంగా ఉంటాయన్నారు.
మల్లన్న సన్నిధిలో
ఎమ్మెల్సీ కొమురయ్య
కొమురవెల్లి(సిద్దిపేట): మల్లన్నస్వామిని ఎమ్మెల్సీ మల్క కొమురయ్య కుటుంబసమేతంగా సోమవారం దర్శించుకున్నారు. స్వామి వారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం నిత్యాన్నదానానికి రూ.1,00,116 విరాళంగా ఈఓ వెంకటేశ్‌కు అందజేశారు. కార్యక్రమంలో ఆలయ ప్రధానార్చకులు మహదేవుని మల్లికార్జున్, ముఖ్య అర్చకులు ఆంజనేయులు, పర్యవేక్షకులు నీల శేఖర్ తదితరులు పాల్గొన్నారు.
రాష్ట్ర స్థాయి కరాటే
పోటీల్లో ప్రతిభ
హుస్నాబాద్: రాష్ట్ర స్థాయి కరాటే పోటీల్లో మోడల్ స్కూల్ విద్యార్థులు మంచి ప్రతిభ కనబరిచి పతకాలు సాధించారు. ఈ నెల 21న హన్మకొండలో రాష్ట్ర స్థాయి పోటీలు నిర్వహించారు. ఈ పోటీల్లో అండర్–10 బాలికలు కటాస్ విభాగంలో హర్షిత గోల్డ్ మెడల్, కృతిక, అనుదీపిక, ప్రసన్నలు సిల్వర్ మెడల్ సాధించారు. అండర్–12 కటాస్ విభాగంలో అక్షయ, బాలుర విభాగంలో శశివర్ధన్ గోల్డ్ మెడల్‌తో మెరిపించారు. విద్యార్థులను పాఠశాల ప్రిన్సిపాల్ విశ్వనాథ్, కరాటే మాస్టర్ కంటే రాజు అభినందించారు.
టెట్ వాయిదా వేయాలి
బెజ్జంకి(సిద్దిపేట): ప్రభుత్వం వచ్చే నెల 3వ తేదీ నుంచి నిర్వహించతలపెట్టిన టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్(టెట్)ను తాత్కాలికంగా వాయిదా వేయాలని ఎస్‌టీయూ జిల్లా అసోసియేట్ అధ్యక్షుడు శ్రీనివాస్ డిమాండ్ చేశారు. బెజ్జంకి బాలుర ఉన్నత పాఠశాలలో సోమవారం లంచ్ అవర్‌లో విలేకరులతో మాట్లాడారు. ఎన్నికల విధుల వల్ల చాలా మంది ఉపాధ్యాయులు ప్రిపేర్ కాలేకపోయారన్నారు. కనీసం నెల రోజుల పాటు వాయిదా వేయాలన్నారు. కార్యక్రమంలో హెచ్‌ఎం శ్రీరాములు, ఎస్‌టీయూ ఆర్థిక కార్యదర్శి రామంచ రవీందర్, మండల అధ్యక్షుడు శంకరాచారి, రాజేందర్, రజనీష్‌రెడ్డి, చందన, రఘునాథ్ పాల్గొన్నారు.
ఆకట్టుకున్న గణిత నమూనాలు


