సాగు నీటి ప్రాజెక్టులపై నిర్లక్ష్యం
ఇరిగేషన్ మంత్రి సమీక్షించరేం..
ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్‌రెడ్డి ఆగ్రహం
దుబ్బాక: సాగునీటి ప్రాజెక్టులపై ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని.. ఒక్కరోజైన ఇరిగేషన్ మంత్రి ఉత్తమ్ కుమార్‌రెడ్డి ప్రాజెక్టులపై సమీక్ష చేయకపోవడమే ఇందుకు నిదర్శనమని ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్‌రెడ్డి అన్నారు. సోమవారం నియోజకవర్గంలోని దుబ్బాక, మిరుదొడ్డి, తొగట మండలాల్లోని పలు గ్రామాల్లో నూతనంగా ఎన్నికై న గ్రామపంచాయతీల పాలకవర్గాల ప్రమాణ స్వీకారకార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేసీఆర్ ప్రభుత్వం రైతుల సంక్షేమం కోసం భారీ ప్రాజెక్టులను నిర్మిస్తే ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం కనీసం పట్టించుకోవడం లేదన్నారు. జిల్లాలో మల్లన్నసాగర్, కొండపోచమ్మసాగర్, రంగనాయక సాగర్ వంటి మూడు భారీ ప్రాజెక్టులు ఉన్నప్పటికీ కనీసం పంటలకు నీరందించే కాల్వల నిర్మాణాలు కూడా పూర్తి చేయకపోవడం దారుణమన్నారు. ప్రజల సమస్యలపై కలెక్టర్, ఉన్నత అధికారులకు ఫోన్ చేసినా స్పందించడంలేదన్నారు.
గ్రామాల అభివృద్ధికి పాటుపడాలి
ప్రస్తుతం ఎన్నికై న సర్పంచ్‌లు రాజకీయాలకు అతీతంగా గ్రామాల అభివృద్ధికి ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. నూతనంగా పదవీ బాధ్యతలు చేపడుతున్న సర్పంచ్‌లు, పాలక వర్గాలకు ఎమ్మెల్యే అభినందనలు తెలిపారు.


