అధికారుల అలసత్వం.. నిలిచిన ధాన్యం
● పది రోజులు గడుస్తున్నా పట్టని దైన్యం ● కొనుగోలు కేంద్రంలో 1,500 ధాన్యం బస్తాలు
నంగునూరు(సిద్దిపేట): అధికారుల నిర్లక్ష్యం, రైస్ మిల్లర్ల సహాయ నిరాకరణ రైతులకు శాపంగా మారింది. వడ్లను తూకం వేసి పది రోజులు గడిచినా మిల్లుకు తరలించపోవడంతో ధాన్యం బస్తాల వద్ద రైతులు వడిగాపులు కాస్తున్నారు. ఈవిషయమై అధికారులు, రైస్‌మిల్లు యజమానులకు మొర పెట్టుకున్నా కనికరించడం లేదని రైతులు వాపోతున్నారు. నంగునూరు మండలం గట్లమల్యాల రెండు నెలల కిందట ఐకేపీ ద్వార వడ్ల కొనుగోలు కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. ఇప్పటి వరకు 237 మంది రైతుల ద్వారా 6,700 క్వింటాళ్ల వడ్లను కొనుగోలు చేసి మిల్లుకు తరలించారు. కొనుగోళ్లను నిలిపివేస్తామని అధికారులు ప్రకటించడంతో చివరి రోజు వరకు పది మంది రైతుల నుంచి 1,500 బస్తాల ధాన్యాన్ని తూకం వేశారు.


