విపత్తు నిర్వహణ సమన్వయంతో చేపట్టాలి
● కలెక్టర్ హైమావతి ● అధికారులకు దిశానిర్దేశం
సిద్దిపేటరూరల్: వరదలు, పరిశ్రమలలో ప్రమాదాలు వంటి విపత్తుల సమయంలో సమన్వయంతో సహాయక చర్యలు చేపట్టాలని కలెక్టర్ హైమావతి అధికారులను ఆదేశించారు. సోమవారం జాతీయ విపత్తు నిర్వహణ సంస్థ ఆదేశాల మేరకు విపత్తులు సంభవించినప్పుడు తీసుకోవాల్సిన రక్షణ చర్యలపై అధికారులతో మాక్‌డ్రిల్ ను నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ భారీ వర్షాల కారణంగా వరదలు రావడం, వాగులు ఉప్పొంగడం, ప్రజలు, పశువులు నీటిలో చిక్కుకుపోవడం వంటి విపత్తు పరిస్థితుల్లో కాపాడేందుకు ముందస్తుగా నిర్వహిస్తున్న మాక్ డ్రిల్ ఎంతో ఉపయోగపడుతుందన్నారు.
ఓటరు జాబితా సవరణ చేపట్టాలి
ప్రభుత్వం సూచించిన గడువు లోగా సమగ్ర ఓటరు జాబితా సవరణ చేపట్టాలని కలెక్టర్ హైమావతి అధికారులను ఆదేశించారు. సోమవారం హైదరాబాద్ నుంచి ప్రత్యేక ఓటరు జాబితా సవరణపై రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో కలెక్టర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఓటరు జాబితాలో డూప్లికేట్ ఎంట్రీలు, సమానమైన వివరాలు, బ్లర్ ఫొటోలు వంటి లోపాలను సరిదిద్దడంపై ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. క్షేత్రస్థాయిలో వివరాలను కచ్చితంగా నమోదు చేయాలని సూచించారు.


