సీఎం రేవంత్‌రెడ్డిపై విమర్శలు విడ్డూరం
● మాజీ ఎమ్మెల్యే నర్సారెడ్డి ● గజ్వేల్‌లో సైదయ్య విగ్రహానికి నివాళి
గజ్వేల్: బీఆర్‌ఎస్ హయాంలో పేదల భూములతో రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసిన కేసీఆర్, నేడు సీఎం రేవంత్‌రెడ్డిపై తప్పుడు విమర్శలు చేయడం విడ్డూరంగా ఉందని మాజీ ఎమ్మెల్యే తూంకుంట నర్సారెడ్డి మండిపడ్డారు. సోమవారం గజ్వేల్‌లో దివంగత ఎమ్మెల్యే సైదయ్య, దివంగత ఎమ్మెల్సీ మాదాడి రంగారెడ్డి విగ్రహాలకు డీసీసీ అధ్యక్షురాలు తూంకుంట ఆంక్షారెడ్డి, గజ్వేల్ మార్కెట్ కమిటీ చైర్మన్ నరేందర్‌రెడ్డి, వైస్ చైర్మన్ సర్ధార్‌ఖాన్‌లతో కలిసి పూలమాలలు వేశారు. ఈ సందర్భంగా ఆయన విలేకరులతో మాట్లాడారు. ప్రాజెక్ట్‌లు, పథకాల పేరుతో లక్షల కోట్లు దోచుకున్న కేసీఆర్ కుటుంబం వివిధ సంస్థల్లో పెట్టుబడులను పెట్టిందని ఆరోపించారు. వాటిని కాపాడుకునేందుకు ప్రజలను రెచ్చగొడుతున్నారని ధ్వజమెత్తారు. కేసీఆర్ చేసిన అప్పులకు.. కాంగ్రెస్ ప్రభుత్వం మిత్తీలు కట్టే పరిస్థితి వచ్చిందన్నారు. ఓట్లేసి గెలిపించిన గజ్వేల్ నియోజకవర్గ ప్రజలను సైతం కేసీఆర్ మోసం చేస్తున్నారని అన్నారు. బీఆర్‌ఎస్ ప్రభుత్వ వైఖరి వల్ల మల్లన్నసాగర్ నిర్వాసితులకు తీవ్రమైన అన్యాయం జరిగిందన్నారు. నిర్వాసితులను బీఆర్‌ఎస్ నేతలకు దోచుకున్నారని ఆరోపించారు. రాష్ట్రంలో ఇక కేసీఆర్ శకం ముగిసిందని వ్యాఖ్యానించారు. వారు చేసిన అవినీతి, అక్రమాల చిట్టా ప్రభుత్వం వద్ద ఉన్నదని చెప్పారు. కార్యక్రమంలో కాంగ్రెస్ గజ్వేల్ మండల, పట్టణ శాఖ నాయకులు పాల్గొన్నారు.


