అభివృద్ధి చూసి ఓర్వలేకే విమర్శలు
గజ్వేల్: రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధిని చూసి ఓర్వలేకే ప్రతిపక్షాలు విమర్శలు చేస్తున్నాయని డీసీసీ అధ్యక్షుడు తూంకుంట నర్సారెడ్డి మండిపడ్డారు. ఆదివారం గజ్వేల్–ప్రజ్ఞాపూర్ మున్సిపాలిటీ పరిధిలోని సంగుపల్లిలో మిషన్ భగీరథ నీటి కొరత తలెత్తడంతో సమస్య పరిష్కారానికి మినీ ట్యాంకును ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పేదల సంక్షేమమే లక్ష్యంగా ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి సాహసోపేత నిర్ణయాలతో ముందుకుసాగుతున్నారని కొనియాడారు. ప్రభుత్వానికి నిర్మాణాత్మక సలహాలు, సూచనలు ఇవ్వాల్సిన ప్రతిపక్షాలు తప్పుడు విమర్శలు చేస్తున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. వారి తీరును ప్రజలు గమనిస్తున్నారని, వారి విమర్శలను ఎక్కడికక్కడా తిప్పికొట్టాలని పిలుపునిచ్చారు. నిరంతరం అందుబాటులో ఉంటూ సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని చెప్పారు. కార్యక్రమంలో మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ సర్ధార్‌ఖాన్, నేతలు పాల్గొన్నారు.
డీసీసీ అధ్యక్షుడు తూంకుంట నర్సారెడ్డి


