అందరికీ మెరుగైన వైద్య సేవలు
● మంత్రి పొన్నం ప్రభాకర్
● కోహెడలో మెగా హెల్త్ క్యాంప్ ప్రారంభం
కోహెడరూరల్(హుస్నాబాద్): ప్రజలందకీ మెరుగైన వైద్యం అందించడమే లక్ష్యంగా ప్రభుత్వం పనిచేస్తోందని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. శుక్రవారం కోహెడ మండల కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కాళాశాలలో ఆర్వీఎం ఆస్పత్రి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మెగా హెల్త్ క్యాంప్‌ను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి వైద్య శిబిరంలోని ప్రతి విభాగాన్ని పరిశీలించి, పరీక్షల కోసం వచ్చిన వారితో మాట్లాడారు. ‘మీకు ఏ చిన్న ఆరోగ్య సమస్య ఉన్నా.. పరీక్షలు చేయించుకోండి. ఇక్కడ సాధ్యం కాని పక్షంలో హైదరాబాద్‌కు తీసుకెళ్లి ప్రభుత్వ ఖర్చుతో మెరుగైన వైద్యం చేయిస్తాం’ అని మంత్రి హామీ ఇచ్చారు. పరీక్షల అనంతరం రోగులకు ఉచితంగా మందులు అందజేయాలని వైద్యులను ఆదేశించారు.
చదువుతోనే ఉజ్వల భవిష్యత్తు
అనంతరం జూనియర్ కళాశాల విద్యార్థులతో మంత్రి ప్రత్యేకంగా సమావేశయ్యారు. కళాశాలలోని మౌలిక సదుపాయాలపై విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు. ప్రభుత్వ కళాశాలల్లో అన్ని వసతులు కల్పిస్తున్నాం..మీరు పట్టుదలతో చదవి ఉన్నత లక్ష్యాలను సాధించాలని విద్యార్థులకు దిశానిర్దేశం చేశారు. కార్యక్రమంలో కలెక్టర్ హైమావతి, గ్రంథాలయ సంస్థ చైర్మన్ లింగమూర్తి, డీఎంహెచ్‌ఓ ధనరాజ్ తదితరులు పాల్గొన్నారు.
హుస్నాబాద్: డాక్టర్లు దేవుడితో సమానమని, ఏ ఆరోగ్య సమస్య ఉన్నా వారితో చెప్పుకోవాలని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. హుస్నాబాద్, అక్కన్నపేటలో శుక్రవారం మెగా ఉచిత వైద్య శిబిరాన్ని నిర్వహించారు. అక్కన్నపేటలో సిద్దిపేట ప్రభుత్వ వైద్య కళాశాల ఆధ్వర్యంలో, హుస్నాబాద్‌లో సురభి వైద్య కళాశాల ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ అక్కన్నపేట మండలాన్ని సిద్దిపేట ప్రభుత్వ వైద్య కళాశాల దత్తత తీసుకొని అన్ని వైద్య పరీక్షలు నిర్వహిస్తోందన్నారు. హుస్నాబాద్ నియోజకవర్గంలోని ఏడు మండలాలను ఏడు మెడికల్ కళాశాలలు దత్తత తీసుకొని మెడికల్ క్యాంప్‌లు ఏర్పాటు చేసేలా ప్రభుత్వం నుంచి ప్రత్యేక జీవో తెచ్చినట్లు వెల్లడించారు. హుస్నాబాద్‌కు పీజీ మెడికల్ కళాశాల వస్తోందని డాక్టర్లు నిత్యం అందుబాటులో ఉంటారని తెలిపారు. ఆశా వర్కర్లు, అంగన్ వాడీటీచర్లు గ్రామాల్లో ప్రజలకు ఎలాంటి ఆరోగ్య సమస్యలు ఉన్నా సేకరించాలన్నారు.
డాక్టర్లు దేవుడితో సమానం


