ఇళ్లు ఇక్కడ.. ఓట్లు అక్కడ
● వార్డుల విభజనలో అన్ని లోపాలే
● ఊసులేని కొత్త వార్డులు
● పాత వార్డుల్లోనే సర్దుబాటు
● గజ్వేల్ ఆర్‌అండ్‌ఆర్ కాలనీలో దుస్థితి
గజ్వేల్–ప్రజ్ఞాపూర్ మున్సిపాలిటీలోని మల్లన్నసాగర్ నిర్వాసితుల కాలనీ (ఆర్‌అండ్‌ఆర్ కాలనీ) వార్డుల విభజన గందరగోళంగా మారింది. ఈ కాలనీకి చెందిన 14వేలకుపైచిలుకు ఓట్లను 7, 8, 9, 10, 11, 12 వార్డుల్లో చేర్చారు. చాలావరకు ఇళ్లు ఒక వార్డులో ఉంటే.. ఓట్లు మరో వార్డులో కేటాయించారు. దీనివల్ల ఇబ్బందులు తప్పేలా లేవు. ఈ అంశంపై మున్సిపల్ కార్యాలయానికి అభ్యంతరాలు వెల్లువెత్తుతున్నాయి. మరోవైపు తమ కాలనీకి పది వరకు వార్డులు వస్తాయని భావిస్తే.. పాత వార్డుల్లోనే సర్దుబాటు చేయడంపై ఆందోళన వ్యక్తమవుతోంది. – గజ్వేల్
ఓట్ల గజిబిజి ఇలా..
● గజ్వేల్ ఆర్‌అండ్‌ఆర్ కాలనీలోని ఏటిగడ్డ కిష్టాపూర్‌కు సహకార సంఘం మాజీ చైర్మన్ కురాకుల మల్లేశంతోపాటు ఆయన కుటుంబీకులు 21మంది ప్రస్తుతం మున్సిపల్ వార్డు విభజనలో భాగంగా 12వ వార్డులో నివాసముంటున్నారు. కానీ 3 ఓట్లు మినహా మిగతా 18 ఓట్లను 10వ వార్డులో కలిపారు. దీనిపై మున్సిపల్ అధికారులకు ఫిర్యాదు చేశారు.
● పదో వార్డులోని 200మంది ఎస్సీ కుటుంబాలకు చెందిన ఓట్లను 12వ వార్డులో కలిపారు. దీంతో గందరగోళం నెలకొంది. ఈ రెండే కాదు.. ఆర్‌అండ్‌ఆర్ కాలనీకి కేటాయించిన మిగతా 7, 8, 9, 11వార్డుల్లోనూ ఇదే దుస్థితి.
● కొన్ని వార్డుల్లో ఒకే కుటుంబానికి చెందిన భా ర్యది ఒకచోట, భర్తది మరో చోట, పిల్లల ఓట్లు వేరే ప్రాంతంలో ఉండటం సమస్యగా మారింది.
గజ్వేల్–ప్రజ్ఞాపూర్ మున్సిపాలిటీ పరిధి లోని ముట్రాజ్‌పల్లి, సంగాపూర్ గ్రామాల పరిధిలో మల్లన్నసాగర్ నిర్వాసితులకు ఆర్‌అండ్‌ఆర్ కాలనీని నిర్మించిన సంగతి తెల్సిందే. ఈ రిజర్వాయర్ నిర్మాణం వల్ల తొగుట మండలంలో పల్లెపహాడ్, వేములగాట్, ఏటిగడ్డ కిష్టాపూర్, లక్ష్మాపూర్, రాంపూర్, బ్రాహ్మణ బంజేరుపల్లి, కొండపాక మండలం సింగారం, ఎర్రవల్లి గ్రామాలు పూర్తిగా ముంపునకు గురైన విషయం కూడా విదితమే. ఆయా గామాలకు చెందిన సుమారుగా 14వేలకుపైగా ఓట్లు గజ్వేల్–ప్రజ్ఞాపూర్ మున్సిపాలిటీకి బదిలీ అయ్యాయి. కానీ మెజార్టీ నిర్వాసితులు మున్సిపాలిటీలో విలీనం కోరుకోవడం లేదు. తమ గ్రామాలను పంచాయతీలుగా కొనసాగించాలని కోరుతూ వస్తున్నారు. మున్సిపాలిటీ విలీనం ఏమైనా సక్రమంగా ఉందా..? ఆ పరిస్థితి లేకపోవడం నిర్వాసితులను ఇబ్బందులకు గురిచేస్తున్నది.
ఇంటి నంబర్లు లేకపోవడమే కారణం
మున్సిపాలిటీ పరిధిలోని ఆర్‌అండ్‌ఆర్ కాలనీ వార్డుల విభజనలో లోపాలు తలెత్తడానికి ఇప్పటివరకు ఈ కాలనీకి ఇంటి నంబర్లు లేకపోవడమే ప్రధాన కారణంగా స్పష్టమవుతోంది. 2020లో ముంపు గ్రామాలను ఇక్కడికి తరలించిన అధికారులు వీరిని గ్రామ పంచాయతీలుగా కొనసాగించాలని తొలుత భావించారు. దీంతో వీరికి పాత ఇంటి నంబర్లే కొనసాగాయి. కానీ నేడు పంచాయతీలను రద్దు చేసి.. మున్సిపల్ వార్డుల విభజనలో భాగంగా ఈ గ్రామాలను విలీనం చేసిన సందర్భంలో ఇంటి నంబర్లు లేక...వరుస క్రమంలో వార్డుల్లో చేర్చడం ఇబ్బందిగా మారింది.
పది వార్డులొస్తాయని భావిస్తే...
మున్సిపాలిటీలో ఆర్‌అండ్‌ఆర్ కాలనీకి చెందిన 14వేల పైచిలుకు ఓట్ల విలీనంతో ప్రస్తుతమున్న 20వార్డులకు మరో 10వార్డులు పెరిగి 30కి చేరుకుంటాయని భావించారు. ఆ పది వార్డులు కూడా తమకు ప్రత్యేకంగా ఉంటాయని, తమ సమస్యలను చెప్పుకోవడానికి ప్రభుత్వంపై ఒత్తిడి పెంచవచ్చనని అనుకున్నారు. కానీ పరిస్థితి తారుమారు కావడంతో ఆందోళన చెందుతున్నారు.
మమ్మల్ని ఆగం జేసిండ్రు
గ్రామ పంచాయతీలను రద్దు చేసి మమ్మల్ని ఆగం జేసిండ్రు. ఇప్పుడైనా వార్డుల విభజన సక్కగా చేస్తరనుకుంటే అది జరగలేదు. ఇల్లు ఒక దగ్గర ఉంటే.. ఓటు మరో దగ్గర ఇచ్చిండ్రు. మాకు 10 వార్డులు వస్తే బాగుండేది. మా సమస్యలను చెప్పుకునే అవకాశం కలిగేది. కానీ పాత వార్డుల్లోనే సర్దుబాటు చేస్తే ఎట్ల?
–కురాకుల మల్లేశం, సహకార సంఘం మాజీ చైర్మన్, ఆర్‌అండ్‌ఆర్ కాలనీ
ఇళ్లు ఇక్కడ.. ఓట్లు అక్కడ
ఇళ్లు ఇక్కడ.. ఓట్లు అక్కడ


