జిల్లా జోలికి వస్తే ఊరుకోం..
● సంగారెడ్డిలో కలపాలని కుట్రలు
● సీఎం రేవంత్ రెడ్డిపై హరీశ్ ఆగ్రహం
సిద్దిపేటజోన్: ‘సిద్దిపేట జిల్లా ఈ ప్రాంత ప్రజల చిరకాల కోరిక. ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత జిల్లా ఏర్పాటు చేసుకున్నాం. ఇప్పుడు సీఎం రేవంత్‌రెడ్డి జిల్లాలు ఎక్కువ అయ్యాయని సాకు చూపి జిల్లాను రద్దు చేసి, సంగారెడ్డిలో కలపాలని కుట్రలు చేస్తున్నారు. జిల్లా జోలికి వస్తే ఉరుకోం’ అని మాజీ మంత్రి హరీశ్‌రావు అన్నారు. శుక్రవారం జిల్లా కేంద్రంలో పట్టణ బీజేపీ మాజీ అధ్యక్షుడు శ్రీనివాస్ తన అనుచరులతో బీఆర్‌ఎస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా వారికి కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. అనంతరం ఆయన మాట్లాడారు... కాంగ్రెస్ ఇచ్చిన హామీలను అమలు చేయాలని అసెంబ్లీలో అడిగితే నా మీద కోపం పెట్టుకున్నారన్నారు. ఏదైనా ఉంటే నాపై కోపం చూపించు కానీ సిద్దిపేట ప్రజల మీద కాదని స్పష్టం చేశారు. రేవంత్ రెడ్డి ఎన్ని కుట్రలు చేసిన సిద్దిపేట అస్థిత్వాన్ని కాపాడుకుంటామని, అవసరమైతే మరో ఉద్యమం చేస్తామని హెచ్చరించారు.
పేదవారికి సేవ చేయాలి..
సేవా భావం చాలా గొప్పదని, ప్రతి ఒక్కరూ పేదవారికి సేవ చేయాలని ఎమ్మెల్యే హరీష్ రావు సూచించారు. స్థానిక కంచరీ బజార్‌లో మాజీ ఎమ్మెల్సీ ఫారూఖ్ తన తల్లిదండ్రుల జ్ఞాపకార్ధం పేదలకు నిత్యావసర వస్తువులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా హరీష్ రావు మాట్లాడుతూ.. ప్రజల దీవెనలతో నాయకులు అవుతారని, వారికి లాభాపేక్ష లేకుండా సేవా చేయాలని సూచించారు. కార్యక్రమంలో నాయకులు శర్మ. రాజనర్స్, సంపత్ రెడ్డి, సాయిరాం, సికిందర్ తదితరులు పాల్గొన్నారు.


