ఎమ్మెల్సీ రేసులో సీపీఐ | - | Sakshi
Sakshi News home page

ఎమ్మెల్సీ రేసులో సీపీఐ

Mar 7 2025 9:22 AM | Updated on Mar 7 2025 9:19 AM

చాడాకు చాన్స్‌ దక్కేనా?
● అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌ హామీ ● హుస్నాబాద్‌లో కాంగ్రెస్‌ గెలుపునకు కృషి ● ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీకి షెడ్యూల్‌ విడుదల

సాక్షి, సిద్దిపేట: తెలంగాణలో ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికలకు రంగం సిద్ధమైంది. ఎమ్మెల్సీ స్థానాల్లో సీపీఐ జాతీయ కార్యవర్గ సభ్యుడు, మాజీ ఎమ్మెల్యే చాడ వెంకట్‌ రెడ్డికి అవకాశం దక్కుతుందా లేదా అన్న చర్చ జిల్లా వ్యాప్తంగా సాగుతోంది. ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్‌, సీపీఐ పొత్తు పెట్టుకున్నాయి. అందులో రెండు ఎమ్మెల్సీలకు అవకాశం ఇస్తామని కాంగ్రెస్‌ హామీ ఇచ్చినట్లు సమాచారం. ఎమ్మెల్సీలు హసన్‌ మీర్జా, ఎగ్గె మల్లేఽశం, శేరి సుభాష్‌రెడ్డి, మహమూద్‌ అలీ, సత్యవతి రాథోడ్‌ పదవీకాలం ఈ నెల 29వ తేదీతో ముగయనుంది. దీంతో రాష్ట్రంలో ఐదు ఎమ్మెల్సీ లు ఖాళీ అవుతున్నాయి. వాటిని భర్తీ చేసేందుకు కేంద్ర ఎన్నికల కమిషన్‌ గత నెల 28న షెడ్యూల్‌ విడుదల చేసింది. ఈ నెల 10న నామినేషన్ల స్వీకరణ, 11న పరిశీలన, 13న నామినేషన్ల పరిశీలన, 20న పోలింగ్‌ ఉండనుంది.

మొదట హుస్నాబాద్‌ సీటుపై..

అసెంబ్లీ ఎన్నికల్లో.. కాంగ్రెస్‌, సీపీఐ పార్టీల పొత్తులో భాగంగా హుస్నాబాద్‌ ఎమ్మెల్యే సీటును సీపీఐకి కేటాయించాలని పట్టు పట్టారు. హుస్నాబాద్‌, కొత్తగూడెంలలో సీపీఐకి పట్టు ఉండటంతో గెలిచే అవకాశాలు ఎక్కువగా ఉంటాయని ఆ పార్టీ రెండు స్థానాలను అడిగారు. చివరకు హుస్నాబాద్‌ కాంగ్రెస్‌ అభ్యర్థిగా పొన్నం ప్రభాకర్‌కు కేటాయించారు. పొత్తులలో కొత్తగూడెం సీటును కూనంనేని సాంబశివరావు కు కేటాయించారు. సీపీఐ అధిష్టానం సూచించిన ఇద్దరికీ ఎమ్మెల్సీలుగా అవకాశం ఇస్తామని గతంలోనే హామీ ఇచ్చినట్లు ప్రచారం.

పొన్నం గెలుపు కోసం..

హుస్నాబాద్‌ ఎమ్మెల్యేగా కాంగ్రెస్‌ పార్టీ నుంచి పొన్నం ప్రభాకర్‌ గెలుపొందేందుకు సీపీఐ నేతలు కీలక పాత్ర పోషించారు. ఎన్నికల ప్రచారంలో నిత్యం పాల్గొని విజయానికి కృషి చేశారు.

చాడాకు అవకాశం వచ్చేనా?

2004లో ఇందుర్తి నియోజక వర్గం నుంచి ఎమ్మెల్యేగా చాడ వెంకట్‌ రెడ్డి గెలుపొందారు. రేకొండ సర్పంచ్‌గా, చిగురుమామిడి ఎంపీపీ, జెడ్పీటీసీగా చాడ వెంకట్‌రెడ్డి పని చేశారు. దీనితో తనకు అవకాశం ఇవ్వాలని పార్టీ అంతర్గత సమావేశాల్లో చర్చించినట్లు తెలిసింది. చాడ కే అవకాశం దక్కుతుందని అంతా ఎదురు చూస్తున్నారు.కాంగ్రెస్‌ అధిష్టానం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో వేచి చూడాలి.

ముఖ్యమంత్రి, టీపీసీసీ చీఫ్‌లను కలిసిన సీపీఐ నేతలు

ఐదు ఎమ్మెల్సీ స్థానాల్లో కాంగ్రెస్‌కు 4, బీఆర్‌ఎస్‌కు ఒక ఎమ్మెల్సీ దక్కే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో కాంగ్రెస్‌కు దక్కే వాటిలో సీపీఐకి ఒకటి అవకాశం ఇవ్వాలని ఇప్పటికే సీపీఐ నేతలు సీఎం రేవంత్‌రెడ్డిని, టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్‌ కుమార్‌ గౌడ్‌ను కలిశారు. ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు, సీపీఐ నాయకులు చాడా వెంకట్‌ రెడ్డి, తక్కల్లపల్లి శ్రీనివాస్‌ రావులు కలిసిన వారిలో ఉన్నారు.

ఎమ్మెల్సీ రేసులో సీపీఐ 1
1/1

ఎమ్మెల్సీ రేసులో సీపీఐ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement