కొండపాక(గజ్వేల్): మండలంలోని ఖమ్మంపల్లి అటవీ ప్రాంతంలో సోమవారం ప్రమాదవశాత్తు పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి. వ్యవసాయ బావుల వద్ద ఉన్న రైతులు భయాందోళనకు గురై పరుగులు తీశారు. వ్యవసాయ బావి వద్ద ఉంచిన వల్లంగల్ల రాములుకు చెందిన ట్రాక్టర్, టైర్లు కాలిపోగా ఇతర రైతుల వ్యవసాయ పరికరాలు, పండ్ల తోటలు పాక్షికంగా దెబ్బతిన్నాయి. అటవీ ప్రాంతానికి సమీపంలో ఖమ్మంపల్లి ఉండటంతో స్థానికులు వెంటనే ఫారెస్టు అధికారులకు, పోలీసులకు, అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. హుటాహుటిన ఘటనాస్థలికి చేరుకున్న అధికారులు, అగ్నిమాపక సిబ్బంది మంటలను ఆర్పివేశారు. రాత్రి వేళ అయితే మంటలు గ్రామంలోకి వ్యాపించి తీవ్ర నష్టం జరిగేదంటూ ఆవేదనకు గురయ్యారు. మంటలను ఆర్పే ప్రయత్నంలో త్రీ టౌన్ సీఐ విద్యాసాగర్ చూపిన చొరవకు గ్రామస్తులు అభినందనలు తెలిపారు.
భయాందోళనతో
పరుగులు తీసిన రైతులు
మంటలు ఆర్పిన అగ్నిమాపక సిబ్బంది