యథేచ్ఛగా గ్యాస్‌ అక్రమ దందా | Sakshi
Sakshi News home page

యథేచ్ఛగా గ్యాస్‌ అక్రమ దందా

Published Tue, Apr 16 2024 6:45 AM

-

● సబ్సిడీ పక్కదారి ● కమర్షియల్‌, మినీ సిలిండర్లలోకి ఫిల్లింగ్‌ ● బహిరంగంగానే విక్రయాలు ● పట్టించుకోని సివిల్‌ సప్లయ్‌ అధికారులు

సాక్షి, సిద్దిపేట: జిల్లాలోని సిద్దిపేట, హుస్నాబాద్‌, గజ్వేల్‌, దుబ్బాక, చేర్యాల పట్టణ కేంద్రాల్లో సబ్సిడీ గ్యాస్‌ రీ ఫిల్లింగ్‌ దందా జోరుగా సాగుతోంది. జనావాసాల నడుమ అక్రమదందా నడుస్తుండటంతో ఎప్పుడు ఏ ప్రమాదం జరుగుతుందోనని స్థానికులు ఆందోళన చెందుతున్నారు. కేజీ గ్యాస్‌ రూ.125లకు చొప్పున విక్రయిస్తున్నారు. ఒక్కో సిలిండర్‌లో 2 నుంచి 3 కేజీల గ్యాస్‌ను నింపుతున్నారు. ముఖ్యంగా సిద్దిపేట, గజ్వేల్‌లోని పలు గ్యాస్‌ ఏజెన్సీల నిర్వాహకులు, గ్యాస్‌ డెలివరీ చేసే వ్యక్తులు అక్రమార్జనకు తెరలేపి సబ్సిడీ గ్యాస్‌ పక్కదారి పట్టిస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.

సబ్సిడీ పెరగడంతో..

రాష్ట్రంలో కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత రూ.500లకే గ్యాస్‌ సిలిండర్‌ను అందిస్తుండటంతో రీ ఫిల్లింగ్‌ దందా ఉధృతంగా సాగుతున్నట్లు తెలుస్తోంది. గ్యాస్‌ను తక్కువగా వినియోగించుకునే వారిని గ్యాస్‌ డెలివరీ బాయ్స్‌, ఏజెన్సీ నిర్వాహకులు గుర్తించి వారిచే గ్యాస్‌ బుక్‌ చేపిస్తున్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుంచి వచ్చే సబ్సిడీని మీరే తీసుకోండి అని వినియోగదారులకు ఆఫర్‌ ఇచ్చి గాలం వేస్తున్నారు. దీంతో వారి వైపు మొగ్గు చూపి గ్యాస్‌ బుక్‌ చేస్తున్నారు. ఇలా వచ్చిన గ్యాస్‌ సిలిండర్‌ను రీ ఫిల్లింగ్‌, వాణిజ్య అవసరాలకు వినియోగించేవారికి రూ.1,100లకు విక్రయిస్తున్నారు. వీరి అక్రమాలపై నిఘా పెట్టి నియంత్రించాల్సిన అధికారులు ముడుపులు తీసుకుని పట్టించుకోవడం లేదనే ఆరోపణలున్నాయి. ఎవరైనా ఫిర్యాదు చేస్తే నామమాత్రంగా కేసులు నమోదు చేస్తున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి.

సబ్సిడీ గ్యాస్‌ వాణిజ్య అవసరాలకు వినియోగం

కేసులు నమోదు చేస్తున్నాం

గ్యాస్‌ రీ ఫిల్లింగ్‌ చేస్తున్న వారి పై కేసులు నమోదు చేస్తున్నాం. జిల్లా వ్యాప్తంగా తనిఖీలు నిర్వహిస్తున్నాం. సబ్సిడీ గ్యాస్‌ వాణిజ్య అవసరాలకు వినియోగించవద్దు, చిన్న సిలిండర్లలో నింపవద్దు. అలా చేయడం నేరం.

– తనూజ, డీఎస్‌ఓ

Advertisement
 
Advertisement