తూప్రాన్: మనోహరాబాద్ పోలీస్ స్టేషన్‌ను తూప్రాన్ డీఎస్పీ నరేందర్ గౌడ్ గురువారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా స్టేషన్‌లోని క్రైమ్ ఫైల్స్, కేసు డైరీలు, కానిస్టేబుల్ కిట్స్‌తో పాటు ఇతర రికార్డులను ఆయన క్షుణ్ణంగా పరిశీలించారు. అనంతరం డీఎస్పీ మాట్లాడుతూ.. దర్యాప్తులో పెండింగ్‌లో ఉన్న కేసులను త్వరితగతిన పరిష్కరించాలని అధికారులకు సూచించారు. ఆస్తి సంబంధిత నేరాలను ఛేదించి, చోరీకి గురైన సొత్తును రికవరీ చేయడంపై ప్రత్యేక దృష్టి సారించాలని ఆదేశించారు. డయల్ 112 కు వచ్చే కాల్స్‌కు తక్షణమే స్పందించి బాధితులకు సత్వర న్యాయం అందించాలన్నారు. రౌడీ షీటర్ల కదలికలను ఎప్పటికప్పుడు సమీక్షిస్తూ, అనుమానితుల పట్ల అప్రమత్తంగా వ్యవహరించాలని తెలిపారు. 44వ జాతీయ రహదారిపై నిత్యం ప్రమాదాలు జరుగుతున్న నేపథ్యంలో, ప్రజలకు ట్రాఫిక్ నిబంధనలపై విస్తృతంగా అవగాహన కల్పించాలని పేర్కొన్నారు. రహదారి భద్రత దృష్ట్యా వాహన తనిఖీలను ముమ్మరం చేయాలని పోలీసు సిబ్బందిని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో ఎస్‌ఐ సుభాష్‌గౌడ్, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.


