ఇక మిల్లెట్‌ కేఫ్‌లు | - | Sakshi
Sakshi News home page

ఇక మిల్లెట్‌ కేఫ్‌లు

Nov 6 2026 11:21 AM | Updated on Nov 6 2026 11:21 AM

● మహిళా సంఘాలతో ఏర్పాటు

● ఒక్కోదానికి రూ. 2.2 కోట్ల అంచనా

● చిరు ధాన్యాల సాగుకు ప్రోత్సాహకం

సంగారెడ్డి జోన్‌: వ్యవసాయ రంగంలో చిరుధాన్యాల సాగును ప్రోత్సహిస్తూ మహిళా సంఘాల సభ్యులకు మరింత ఆదాయం పెంపొందించే దిశగా రాష్ట్ర ప్రభుత్వం అడుగులు వేస్తుంది. కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేయడమే లక్ష్యంగా ప్రత్యేక పథకాలు అమలు చేస్తుంది. తాజాగా మిల్లెట్‌ కేఫ్‌లను ఏర్పాటు చేసేందుకు చర్యలు చేపట్టింది. దీంతో మహిళా స్వయం సంఘాల సభ్యులకు మరింత ఉపాధి, ఆదాయం లభించనుంది.

పెరగనున్న సాగు విస్తీర్ణం

మిల్లెట్‌ కేఫ్‌ల ఏర్పాటుతో జిల్లాలో చిరుధాన్యాలు సాగు విస్తీర్ణం పెరగనుంది. రాగులు, జొన్నలు, మినుములు, సజ్జలు, కొర్రలు, సామలు వంటి పంటలు జిల్లాలో 15 నుంచి 20 వేల ఎకరాల విస్తీర్ణంలో సాగవుతున్నాయి. సుమారు 20 ఏళ్ల క్రితం చిరుధాన్యాల సాగు విస్తీర్ణం సుమారు 40 వేల ఎకరాల వరకు ఉండేది. వాణిజ్య పంటలలో ప్రధాన పంట పత్తి సాగు విస్తీర్ణం పెరగడంతో క్రమంగా చిరుధాన్యాల సాగు విస్తీర్ణం తగ్గింది. ఎల్‌నినో నేపథ్యంలో వర్షాభావ పరిస్థితుల దృష్ట్యా తక్కువ నీటితో సాగయ్యే చిరుధాన్యాలతో పాటు ఇతర పంటలు సాగు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. కేఫ్‌ల ఏర్పాటుతో క్రయవిక్రయాలు ఎక్కువగా జరగటంతో వీటికి ప్రాధాన్యత సంతరించుకుంటుంది.

మరింత ఉపాధి, ఆదాయం

మహిళా సంఘాలు ప్రారంభమైన మొదట్లో సభ్యులు చిన్న మొత్తంలో రుణాలు తీసుకొని చిన్న చిన్న వ్యాపారాలు నిర్వహించారు. మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా ప్రభుత్వం అందించే పథకాలను అందిపుచ్చుకొని పెట్టుబడిదారులుగా మారి ఉపాధితో పాటు ఆదాయం పొందుతున్నారు. పాఠశాల విద్యార్థులకు యూనిఫాంలు కుట్టడం, కమ్యూనిటీ మేనేజ్‌మెంట్‌ ట్రైనింగ్‌ సెంటర్ల నిర్వహణతో పాటు ఇందిరా మహిళా శక్తి హోటల్‌ తదితర వ్యాపారాలు నిర్వహిస్తున్నారు. ప్రతి మండల సమాఖ్య ఆధ్వర్యంలో జిల్లావ్యాప్తంగా 26 బస్సులను కొనుగోలు చేసి ఆర్టీసీకి అద్దెకు ఇచ్చారు. ఈవిధంగా ప్రతి నెల ఒక్కో బస్సు ద్వారా రూ. 69,468 ఆదాయం పొందుతున్నారు. అదేవిధంగా సంగారెడ్డి పట్టణంలో జిల్లా సమాఖ్య ఆధ్వర్యంలో మహిళా పెట్రోల్‌ బంక్‌ను ఏర్పాటు చేసి నిర్వహణ చేస్తున్నారు. దీంతో సభ్యులు ఉపాధితో పాటు ఆదాయం పొందుతున్నారు.

ఇప్పటికే పలుచోట్ల ఏర్పాటు

ఆరోగ్యకరమైన అలవాట్లను ప్రోత్సహించడంతో పాటు చిరుధాన్యాల పోషక విలువలను నేటి తరానికి అందించాలనే లక్ష్యంతో ప్రభుత్వం మిల్లెట్‌ కేఫ్‌ల ఏర్పాటుకు నిర్ణయించింది. ఇప్పటికే రాష్ట్రంలో పలుచోట్ల నిర్మాణ పనులు కొనసాగుతున్నాయి. వాటిని త్వరలో ప్రారంభించనున్నారు. ఒక్కో నిర్మాణానికి రూ.2.2 కోట్ల పెట్టుబడి అవసరం ఉన్నట్లు అధికారులు గుర్తించారు. ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మిల్లెట్స్‌ రీసెర్చ్‌, ఏపీపీసీ సంస్థలతో కేఫ్‌ నిర్వహణకు ఒప్పందాలు కుదుర్చుకున్నారు. జిల్లాలోని అధిక డిమాండ్‌ ఉన్న ప్రాంతాలను గుర్తించి ఏర్పాటు చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు.

పెరుగుతున్న ఆదరణ

కరోనా అనంతరం మిల్లెట్‌ ఫుడ్‌కు ఆదరణ పెరుగుతుంది. జహీరాబాద్‌ ప్రాంతంలో ఎక్కువగా చిరు ధాన్యాలను సాగు చేస్తుంటారు. ఇక్కడి డెక్కన్‌ డెవలప్‌మెంట్‌ సొసైటీ, అరణ్య వ్యవసాయ శాశ్వత సంస్థ ఆధ్వర్యంలో మహిళా రైతులు ఎలాంటి రసాయనాలు వినియోగించకుండా చిరు ధాన్యాల పంటలు సాగు చేస్తుంటారు. ఈ పంటలను నేరుగా జిల్లా అధికారులకు, ఇతరులకు విక్రయిస్తుంటారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement