సంగారెడ్డి టౌన్: బాల కార్మిక వ్యవస్థను పూర్తిగా నిర్మూలించాలని జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి సౌజన్య అన్నారు. జాతీయ న్యాయ సేవల దినోత్సవాన్ని పురస్కరించుకొని గురువారం సంగారెడ్డిలోని జువైనల్ జస్టిస్ బోర్డులో న్యాయ అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈసందర్భంగా ఆమె మాట్లాడుతూ.. విద్యార్థులు తమ హక్కుల గురించి తెలుసుకోవాలని, బాల్య వివాహాల నిర్మూలన, అక్రమ రవాణ, దోపిడీ నివారణను అరికట్టాలన్నారు. ఎక్కడైనా పిల్లలపై అన్యాయం జరిగితే సంబంధిత శాఖల అధికారులకు తెలియజేయాలని సూచించారు. కార్యక్రమంలో న్యాయవాదులు, విద్యార్థులు, ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు.
సంగారెడ్డి జోన్: మహిళా సంఘాల సభ్యులు వ్యాపారవేత్తలుగా ఎదగాలని డీఆర్డీఏ ఉమాహారతి సూచించారు. గురువారం పట్టణంలోని కార్యాలయంలో జిల్లా మహిళా సమాఖ్య సమావేశం నిర్వహించారు. ఈసందర్భంగా ఆమె మాట్లాడుతూ.. మహిళా సంఘాల సభ్యులు వ్యాపార రంగంలో రాణించి, ప్రతి మండల సమాఖ్య ఆదాయం వచ్చే కార్యక్రమాలు చేపట్టాలన్నారు. అందుకు అవసరమయ్యే శిక్షణ పెట్టుబడి సహకారం అందిస్తామన్నారు. మంజూరైన మండల సమాఖ్య భవనాలు త్వరితగతిగా పూర్తి చేయాలన్నారు. ఎల్‌నినో నేపథ్యంలో ప్రతి ఒక్కరూ ఇంకుడు గుంతలు నిర్మించుకోవాలని సూచించారు. అవకాశం ఉన్నవారు నీటి కుంటలు ఏర్పాటు చేయాలన్నారు. సమావేశంలో జిల్లా సమాఖ్య అధ్యక్షురాలు యోగేశ్వరి, అదనపు డీఆర్డీఓ సూర్యారావు తదితరులు పాల్గొన్నారు.
జహీరాబాద్ టౌన్: రైతు భరోసా నిధులు అకౌంట్లలో జమ అయ్యాయంటూ మెసేజ్‌లు వస్తున్నాయి. గురువారం పలువురు రైతుల సెల్‌ఫోన్‌కు మెసేజ్‌లు రాగా, నిజమే అనుకొని రైతులు సంతోషపడ్డారు. రబీ పంటల సాగుకు పెట్టుబడి సాయం వచ్చిందని మురిసిపోయారు. అయితే బ్యాంకు బ్యాలెన్స్ చెక్ చేసుకోగా డబ్బులు కనిపించకపోవడంతో నిరాశచెందారు. ఇదే విషయమై వ్యవసాయ శాఖ అధికారులను సంప్రదించగా ఎవరి అకౌంట్లలోనూ డబ్బులు జమ చేయలేదని స్పష్టం చేశారు. రైతులకు ఫేక్ మెసేజ్‌లు వస్తున్నాయని, వాటిని నమ్మవద్దని చెప్పారు.
నారాయణఖేడ్: ఎల్‌నినో ప్రభావం, వాతావరణ మార్పులతో నష్టపోయిన రైతులను తక్ష ణమే ప్రభుత్వం ఆదుకోవాలని సీపీఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి నరసింహ డిమాండ్ చేశా రు. మనూరు, నారాయణఖేడ్ మండలాల్లో దెబ్బతిన్న పంటలను యూనియన్ నాయకులతో కలిసి గురువారం పరిశీలించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వరికి రూ.30 వేలు, వాణిజ్య పంటలకు రూ.50వేల చొప్పున ఎకరాకు నష్టపరిహారం చెల్లించాలన్నారు. రైతుల పక్షాన ఈనెల 10న రాష్ట్రవ్యాప్తంగా కలెక్టరేట్ల ఎదుట ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు. కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి సయ్యద్ జలాలుద్దీన్, సహాయ కార్యదర్శులు ఆనంద్, రెహమాన్, ఏఐవైఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు మర్రి శ్రీమాన్ పాల్గొన్నారు.


