● ఓయూ సీనియర్ ప్రొఫెసర్ సుధాకర్ రెడ్డి
● ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో జాతీయ సదస్సు ప్రారంభం
పటాన్‌చెరు టౌన్: వాతావరణ మార్పులు ఆర్థిక, సామాజిక, ప్రకృతి అంశాలపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయని ఉస్మానియా యూనివర్సిటీ సీనియర్ ప్రొఫెసర్ సుధాకర్ రెడ్డి అన్నారు. గురువారం పటాన్‌చెరు ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ‘శీతోష్ణస్థితి అంశాలు– విధానం, శాస్త్రం, మానవ భవిష్యత్తు’ అనే అంశంపై రెండు రోజుల జాతీయ సదస్సు గురువారం ప్రారంభమైంది. ఐసీఎస్‌ఎస్‌ఆర్, కళాశాల విద్యాశాఖ సహకారంతో నిర్వహించిన సదస్సుకు ప్రిన్సిపాల్ ప్రవీణ అధ్యక్షత వహించారు. ముఖ్య అతిథిగా సుధాకర్ రెడ్డి హాజరై మాట్లాడారు. పర్యావరణ పరిరక్షణపై విద్యార్థులు, యువతలో అవగాహన పెంపొందించాల్సిన అవసరం ఉందన్నారు. వాతావరణ శాస్త్రవేత్త ప్రొఫెసర్ పురుషోత్తం రెడ్డి మాట్లాడుతూ.. భూతాపం, వాతావరణ మార్పులకు మానవ కార్యకలాపాలే ప్రధాన కారణమని అన్నారు. పటాన్‌చెరు పారిశ్రామిక కాలుష్యం గతంలో పలు గ్రామాల ప్రజల ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపిందని గుర్తుచేశారు. సమావేశంలో ప్రొఫెసర్ శ్రీలత, రాజేంద్రప్రసాద్, డాక్టర్ సుజాత, ప్రొఫెసర్ హిమాబిందు, అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు.


