అక్టోబర్ 24 కటాఫ్
తేదీగా నిర్ణయం
అన్ని మండలాల్లో కరువే..
పంట రుణం..
● అంతలోపు తీసుకున్న రుణాల చెల్లింపునకు ఏడాది గడువు
● ఎస్‌ఎల్‌బీసీ ఆదేశాల అమలుకు కసరత్తు
● జిల్లాలో 1.20 లక్షల మంది రైతుల ఖాతాలు
సాక్షిప్రతినిధి, సంగారెడ్డి: కరువు మండలాలను ప్రకటించిన ప్రభుత్వం రైతుల పంట రుణాలకు సంబంధించి మారటోరియం అమలు చేసేందుకు సన్నాహాలు చేస్తోంది. గత ఖరీఫ్ సీజన్‌కు సంబంధించి పంట రుణాలపై ఏడాది పాటు మారటోరియం విధించనుంది. ఈ రుణాలు చెల్లించేందుకు రైతులకు ఏడాది పాటు గడవు లభించనుంది. కానీ ఈ ఏడాది కాలానికి సంబంధించిన వడ్డీ మాత్రం రైతులే చెల్లించాల్సి ఉంటుంది. అక్టోబర్ 24ను కటాఫ్‌గా నిర్ణయించింది. అంటే ఈ తేదీ లోపు పంట రుణాలు తీసుకున్న రైతులకు ఈ మారటోరియం వర్తించనుందని బ్యాంకింగ్ వర్గాలు పేర్కొంటున్నాయి. ఈ మేరకు మారటోరియంను పకడ్బందీగా అమలు చేయాలని ఎస్‌ఎల్‌బీసీ (రాష్ట్ర స్థాయి బ్యాంకర్ల కమిటీ) నుంచి ఆదేశాలు అందాయి. ఈ ఆదేశాల మేరకు ఈ మారటోరియాన్ని అమలు చేయాలని జిల్లాలోని పంట రుణాలు మంజూరు చేసిన బ్యాంకర్లను జిల్లా అధికార యంత్రాంగం ఆదేశించింది.
269 బ్రాంచుల్లో..
గత ఖరీఫ్ సీజన్‌లో జిల్లావ్యాప్తంగా ఉన్న రైతులకు సంబంధించిన 1.20 లక్షల ఖాతాల ద్వారా రూ. 2,520 కోట్లు రుణాలు ఇచ్చినట్లు లీడ్ బ్యాంక్ అధికారులు తెలిపారు. ఈ మారటోరియానికి అర్హులైన రైతులెవరనేది గుర్తించనున్నారు. ఈ మేరకు బ్యాంకుల వారీగా వివరాలు సేకరిస్తున్నారు. జిల్లాలో జాతీయ, ప్రైవేట్, సహకార బ్యాంకులన్నీ కలిసి 269 బ్రాంచులున్నాయి. ఇందులో 46 బ్రాంచ్‌లు పట్టణాల్లో ఉండగా, 91 బ్రాంచ్‌లు గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నాయి. అలాగే సెమీ అర్బన్ ప్రాంతాల్లో మరో 132 బ్రాంచ్‌ల్లో రైతులు ఖాతాదారులుగా ఉన్నారు. వీటిలో అత్యధికంగా టీజీబీ బ్యాంక్ బ్రాంచ్‌లు 53 ఉండగా, ఎస్‌బీఐకి చెందినవి 49 ఉన్నాయి. ప్రైవేట్ రంగ బ్యాంకు హెచ్‌డీఎఫ్‌సీ 16, కెనరా బ్యాంకు 19, డీసీసీబీ 21 బ్రాంచుల్లో రైతులు పంట రుణాలు తీసుకున్నారు.
సిబిల్ స్కోరుకు ఢోకా లేదు కానీ..
మారటోరియానికి అర్హులైన రైతులకు పంట రుణాలు చెల్లించేందుకు ఏడాది పాటు గడువు ఉంటుంది. ఈ ఏడాది పాటు చెల్లించపోయినప్పటికీ ఆ రైతుల సిబిల్ స్కోర్‌కు ఎలాంటి ఇబ్బందులు ఉండవని బ్యాంక్ అధికారులు పేర్కొంటున్నారు. అలాగే ఎన్‌పీఏ (నాన్ పెర్ఫార్మింగ్ అసెట్స్) జాబితాలోకి కూడా ఖాతాలు వెళ్లవు. కానీ ఈ ఏడాది పాటు వడ్డీ మాత్రం చెల్లించాల్సి ఉంటుందని చెబుతున్నారు. ఎవరైన రైతులు వడ్డీ భారమవుతుందని భావించినట్లయితే తమ రుణాలు చెల్లించుకోవచ్చని చెబుతున్నారు.
రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల కరువు మండలాలను ప్రకటించిన విషయం విధితమే. జిల్లాలో మొత్తం 28 మండలాలను కరువు మండలాల జాబితాలో చేర్చారు. ఇందులో కోహీర్, జహీరాబాద్ మండలాల్లో తీవ్ర కరువు పరిస్థితులు నెలకొన్నట్లు, మిగిలిన మండలాల మోడరేట్ కరువు ఉన్నట్లు గుర్తించారు. దీంతో జిల్లాలోని అన్ని మండలాల రైతులు మారటోరియానికి అర్హులవుతారని బ్యాంకింగ్ వర్గాలు చెబుతున్నాయి. మారటోరియం, రుణాల రీషెడ్యూల్‌కు సంబంధించి ఎస్‌ఎల్‌బీసీ నుంచి వచ్చిన ఆదేశాలను అమలు చేసేందుకు చర్యలు చేపట్టామని లీడ్ బ్యాంక్ మేనేజర్ సుధీర్‌కుమార్ ‘సాక్షి’ ప్రతినిధితో పేర్కొన్నారు.


