జాతీయ రహదారిపైకి అడ్డదారుల్లో వస్తున్న వాహనదారులు
అండర్‌పాస్‌ల ద్వారా క్షేమంగా
వెళ్లాలి: అధికారులు
సంగుపేట – శివ్వంపేట మధ్య రోడ్డు ప్రమాదాలు
రాంగ్‌రూట్‌లో వాహనాలు నడపడం వల్ల ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది. కొద్ది దూరం ప్రయాణం, కొంచెం సమయం తగ్గించుకోవడానికి చేస్తున్న ఇలాంటి పనులు రోడ్డు ప్రమాదాలకు దారి తీస్తున్నాయి. నిబంధనలు పాటిస్తూ ప్రయాణం చేయాలని రోడ్డు భద్రతా అధికారులు సూచిస్తున్నారు.
– జోగిపేట(అందోల్)
సంగారెడ్డి, నాందేడ్ – అకోలా రహదారిపై అవసరమైన చోట అండర్ పాస్ బ్రిడ్జిలను నిర్మించకపోవడంతో వాహనదారులు వారి గ్రామాలకు వెళ్లేందుకు షార్టురూట్‌లో వెళ్తున్నారు. దీంతో రోడ్డు ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. అండర్ పాస్‌ల నిర్మాణాలు చేపడితే తప్ప ఈ ప్రమాదాలకు అడ్డుకట్ట వేయలేమని స్థానికులు పేర్కొంటున్నారు. సంగుపేట వద్ద నుంచి శివ్వంపేట బ్రిడ్జి వరకు నెలలో ఎక్కడో ఒక చోట ప్రమాదాలు జరుగుతూనే ఉన్నాయి. ఎక్కువగా ప్రాణాలు కోల్పోయిన ఘటనలే అనేకం. సంగుపేట వద్ద అండర్ పాస్ బ్రిడ్జి నిర్మాణం చేపట్టినా ఈ ప్రాంత వాసులు చందంపేట వైపు వెళ్లేందుకు అడ్డదారుల్లో వెళ్తున్నారు. ఈ క్రమంలో రాంగ్‌రూట్‌లో రోడ్డును దాటేందుకు చేస్తున్న ప్రయత్నాల్లోనే ప్రమాదాలకు గురవుతున్నారు.
షార్టు రూట్ ప్రమాదకరం..
జాతీయ రహదారిపై రాంగ్‌రూట్‌లోనే వాహనాలను నడుపుతున్నారు. అల్మాయిపేట శివారులో ఉన్న హోటల్‌లో భోజనం, లేదా టీ తాగిన వారు జోగిపేట, సంగుపేట, అల్మాయిపేట, అందోలు, నేరడిగుంట ప్రాంతాలకు వెళ్లేందుకు రాంగ్ రూట్‌లోనే కిలోమీటర్ వరకు వెళ్తున్నారు. ఈ క్రమంలో ఎదురుగా వచ్చే వాహనాలు వేగంగా వస్తే ప్రమాదాలు చోటు చేసుకునే అవకాశం ఉంది. కాగా నిబంధనలు ఉల్లంఘించకుండా అండర్ పాస్‌ల ద్వారా ప్రయాణించి తమ ప్రాంతాలకు వెళ్లాలని అధికారులు సూచిస్తున్నారు.


