పలు కర్మాగారాలు సైతం
జహీరాబాద్: డివిజన్ పరిధిలో సాగులో ఉన్న చెరుకు పంటను తరలించుకునేందుకు వీలుగా పలు చక్కెర కర్మాగారాలు నవంబర్ 1 నుంచి క్రషింగ్ నిర్వహించేందుకు సన్నద్ధమయ్యాయి. సంగారెడ్డిలోని గణేశ్ చక్కెర కర్మాగారం మాత్రం నవంబర్ 11న క్రషింగ్‌ను ప్రారంభించనున్నట్లు ప్రకటించింది. రాయికోడ్ మండలంలోని గోదావరి–గంగా చక్కెర కర్మాగారం యాజమాన్యం నవంబర్ 1న క్రషింగ్‌ను ప్రారంభించనున్నట్లు వెల్లడించింది. ఎఫ్‌ఆర్‌పీని పరిగణలోకి తీసుకోకుండా చెరుకు ధర చెల్లించేందుకు ముందుకొచ్చింది. దీంతో రైతులకు టన్నుకు రూ.4,050 ధర చెల్లించాలని నిర్ణయించినట్లు కర్మాగారం వర్గాలు వెల్లడించాయి. ప్రభుత్వం ప్రకటించిన కనీస మద్ధతు ధర 10.25 రికవరీ శాతంపై టన్నుకు రూ.3,650గా నిర్ణయించింది. దీనికి అదనంగా ఆయా కర్మాగారాలు సాధించిన రికవరీ ఆధారంగా రైతులకు ధర చెల్లింపు జరుగుతాయి.
టన్నుకు రూ.4050, అరకిలో చక్కెర
ఎఫ్‌ఆర్‌పీని పరిగణలోకి తీసుకుంటే గోదావరి–గంగా టన్నుకు రూ.3,800 చెల్లించాల్సి ఉంటుంది. అయినా రైతులు పెట్టుబడుల వ్యయాన్ని దృష్టిలో పెట్టుకుని యాజమాన్యం రూ.4,050 చెల్లించాలని నిర్ణయించినట్లు కర్మాగారం వర్గాలు వివరించాయి. అంతేకాకుండా టన్నుకు అర కిలో వంతున చక్కెర ఇచ్చేందుకు నిర్ణయించింది. మొదటి మోడెం పంటకు వచ్చే సీజన్‌కుగాను టన్నుకు అదనంగా రూ.50తో పాటు ఎకరానికి 25 కిలోల చక్కెర ఇచ్చేందుకు ముందుకొచ్చింది. 2వ, 3వ మోడెం పంటలకు టన్నుకు రూ.50 అదనపు ధరతోపాటు ఎకరానికి 50 కిలోల వంతున చక్కెర అందించాలని నిర్ణయించినట్లు కర్మాగారం వర్గాలు వెల్లడించాయి. కొత్తగా చెరుకు పంటను సాగు చేసేందుకు ముందుకొచ్చే రైతులకు ఎకరానికి రూ.4వేల సబ్సిడీని సైతం ఇచ్చి ప్రోత్సహించనుంది. ఎకరానికి 24 టన్నుల మేర దిగుబడిని సాధిస్తేనే ఇది వర్తింపజేస్తుంది. ఇదిలాఉంటే సంగారెడ్డిలోని గణేశ్ చక్కెర కర్మాగారం టన్నుకు రూ.3,988 ధర చెల్లించనుంది. ఎఫ్‌ఆర్‌పీతోపాటు కర్మాగారం సాధించిన రికవరీ ఆధారంగా రైతులకు ఇంతమేర ధర లభించనుంది. గతేడాది టన్నుకు రూ.3,827 ధర చెల్లించింది. 40 కిలోమీటర్లకు పైగా దూరం ఉన్న జోన్ పరిధిలోని రైతులకు గణేశ్ కర్మాగారం టన్నుకు రూ.3.75, గోదావరి–గంగా రూ.3.45 మేర రవాణా సబ్సిడీ చెల్లించనున్నట్లు ప్రకటించాయి.
రేపట్నుంచి గోదావరి–గంగా కర్మాగారంలో క్రషింగ్
నవంబర్ 11 నుంచి గణేశ్ కర్మాగారం ముహూర్తం
జనవరి ఆరంభంలో ట్రైడెంట్ ఫ్యాక్టరీ
రైతులకు రాయితీలు కల్పించనున్న పలు కర్మాగారాలు
జహీరాబాద్ డివిజన్ పరిధిలోని చెరుకు పంట ఇతర జిల్లాల్లోని కర్మాగారాలకు తరలుతాయి. ఆయా జిల్లాల్లోని కామారెడ్డి, మాగి, కొత్తకోట ప్రాంతాల్లోని చక్కెర కర్మాగారాలు సైతం నవంబర్ 1 నుంచి రెగ్యులర్ క్రషింగ్‌ను ప్రారంభించనున్నట్లు కేన్ అధికారులు పేర్కొన్నారు. ఆయా కర్మాగారాలకు జహీరాబాద్ డివిజన్ పరిధిలోని ఏయే మండలాల నుంచి చెరుకును తరలించుకోవాలనే దానిపై ఇంకా కేన్ అధికారులు తుది నిర్ణయం తీసుకోలేదు. రెండు రోజుల్లో కేటాయించనున్న మండలాలను ప్రకటించే అవకాశం ఉంది.


