గ్రాట్యూటీ గాయబ్‌కు స్కెచ్
బెట్టింగ్‌లకు అలవాటు పడి ?
ఎందరి సొమ్ము స్వాహా చేశారో..?
సాక్షిప్రతినిధి, సంగారెడ్డి: సబ్ ట్రెజరీ కార్యాలయాల్లో జరిగిన అవకతవకలపై చేపట్టిన విచారణలో కీలక అంశాలు వెలుగులోకి వస్తున్నాయి. రిటైర్డు అయిన ప్రభుత్వ ఉద్యోగులకు చెల్లించాల్సిన గ్రాట్యూటీ సొమ్మును తమ సొంత బ్యాంకు ఖాతాలోకి మళ్లించేందుకు అక్రమార్కులు పక్కా స్కెచ్ వేశారు. ఈ వ్యవహారంలో ఇప్పటికే అందోల్, పటాన్‌చెరు సబ్ ట్రెజరీ అధికారు(ఎస్టీఓ)లు, రెండుచోట్ల సీనియర్ అకౌంట్స్ ఆఫీసర్లు (ఎస్‌ఏఓ)లు..నలుగురిపై సస్పెన్షన్ వేటు పడిన విషయం విదితమే.
● ప్రభుత్వ ఉద్యోగులు వారి సర్వీసు సంవత్సరాల బట్టి ప్రభుత్వం వారికి గ్రాట్యూటీ చెల్లిస్తుంది. ఒక్కో ఉద్యోగికి సుమారు రూ.16 లక్షల వరకు వస్తుంది. ఈ మొత్తాన్ని రిటైర్డు ఉద్యోగి బ్యాంకు ఖాతాలో జమ చేయాలి. ఐఎఫ్‌ఎంఐఎస్ ఆన్‌లైన్ పోర్టల్ ద్వారా ఈ సొమ్మును చెల్లిస్తారు. ఈ పోర్టల్‌లో రిటైర్డు ఉద్యోగుల బ్యాంకు ఖాతా నంబర్ నమోదు చేయాలి. కానీ ఆందోల్ సబ్‌ట్రెజరీ కార్యాలయంలోని ఎస్టీఓ, ఎస్‌ఏఓలు కలిసి తమ సొంత బ్యాంకు ఖాతా నంబర్లను ఐఎఫ్‌ఎంఐఎస్ పోర్టర్‌లో నమోదు చేశారు. సుమారు రూ.32 లక్షలు తమ సొంత బ్యాంకు ఖాతాకు మళ్లించేందుకు రంగం సిద్ధం చేశారు. అప్రమత్తమైన ఆశాఖ రాష్ట్ర ఉన్నతాధికారులు ఈ చెల్లింపులకు సంబంధించిన టోకెన్లను రద్దు చేశారు.
● పటాన్‌చెరు ఎస్టీఓ కార్యాలయంలో కూడా ఇలాంటి బాగోతమే చోటు చేసుకుంది. రిటైర్డు ఉద్యోగి బ్యాంకు ఖాతాలోకాకుండా, మరో ఖాతాలోకి మళ్లించేందుకు కుట్ర జరిగింది. ఇలా రాష్ట్రవ్యాప్తంగా పలుచోట్ల ఉన్న ఎస్టీఓ కార్యాలయాల్లో ఇలాంటి అక్రమాలే చోటు చేసుకున్నాయి. తమకు రావాల్సిన గ్రాట్యూటీ సొమ్ము రాలేదని రిటైర్డు ఉద్యోగులు ఫిర్యాదు చేయడంతో ఆర్థికశాఖ రాష్ట్ర ఉన్నతాధికారులు ఆరా తీయగా..ఈ అక్రమాల బాగోతం వెలుగులోకి వచ్చింది. దీంతో జిల్లాలో నలుగురు అధికారులపై సస్పెన్షన్ చేస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి.
ఉద్యోగుల రిటైర్డు బెనిఫిట్ సొమ్మును సొంత ఖాతాలోకి ?
మళ్లించేందుకు ప్లాన్ వేసి అడ్డంగా బుక్కయిన ఎస్టీఓలు, ఎస్‌ఏఓలు
ప్రాథమిక విచారణలో ఆసక్తికర అంశాలు
నలుగురిపై సస్పెన్షన్ వేటు
సస్పెన్షన్ వేటు పడిన ఓ అధికారికి బెట్టింగ్‌లకు అలవాటు పడినట్లు విచారణ అధికారుల దృష్టికి వచ్చినట్లు సమాచారం. ఇందుకోసం పెద్ద మొత్తంలో అప్పులు చేసినట్లు తెలిసింది. ఈ క్రమంలోనే సదరు అధికారి అవకతవకలకు పాల్పడేందుకు ప్రయత్నాలు చేశాడా అని ఆరా తీస్తున్నారు.
ఈ అవకతవకలపై ఆర్థికశాఖ రాష్ట్ర జాయింట్ డైరెక్టర్ ప్రవీణ ప్రాథమిక విచారణ చేపట్టారు. ఈ మేరకు ప్రవీణ ప్రాథమిక నివేదికను ఆర్థిక శాఖకు అందజేసినట్లు తెలుస్తోంది. గతంలో ఇలా ఎవరివైనా రిటైర్డు ఉద్యోగుల గ్రాట్యూటీ స్వాహా చేశారా? అని దానిపై శాఖ పరమైన విచారణ చేపట్టారు. తీగ మొత్తం లాగితే ఎంత మొత్తంలో స్వాహా అయిందో అధికారుల విచారణలో తేలనుంది.


