● సంగారెడ్డి, న్యాల్‌కల్‌లో వర్షం
● రైతుల్లో కొందరికి మోదం..మరికొందరికి ఖేదం
సంగారెడ్డి/న్యాల్‌కల్(జహీరాబాద్): జిల్లా కేంద్రం సంగారెడ్డితో పాటు జిల్లాలోని న్యాల్‌కల్‌తో పాటు పలు ప్రాంతాల్లో చాలారోజుల విరామం తర్వాత శుక్రవారం రాత్రి చిరుజల్లులు పడ్డాయి. వాతావరణంలో చోటుచేసుకున్న మార్పులతో కురిసిన వర్షం ప్రజలకు కొంత ఉపశమనం కలిగించింది. అయితే, ఈ వర్షం మరో పదిహేను రోజుల ముందే కురిసివుంటే రైతులకు ఎంతోమేలు జరిగేదని పలువురు రైతులు అభిప్రాయపడుతున్నారు. ప్రస్తుతం చేతికొచ్చిన పంటల దశలో వర్షం కురవడంతో పంటలకు నష్టం వాటిల్లే ప్రమాదం ఉందని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే పంటల సాగు కోసం పెట్టిన పెట్టుబడులు, కష్టానికి తగిన ఫలితం దక్కుతుందో లేదోనని రైతులు ఆవేదన చెందుతున్నారు. వర్షం కొంతవరకు ఉపశమనం కలిగించినప్పటికీ, పంట కోతల సమయంలో ఇలాంటి వాతావరణ పరిస్థితులు ఆందోళనకు గురిచేస్తున్నాయని రైతులు పేర్కొంటున్నారు. సరైన సమయంలో వర్షం కురిస్తే పంటలకు ప్రయోజనం చేకూరేదని, ప్రస్తుతం కురుస్తున్న వర్షం వల్ల చేతికొచ్చిన పంటలకు ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉందని వారు వాపోతున్నారు. ఇక న్యాల్‌కల్ మండలంలో వర్షాలు లేక, నేలలో తేమ ఎండిపోయి పూత కాత దశలో ఉన్న కంది పంటతో పాటు జొన్న, చెరకు తదితర పంటలు దెబ్బతింటుండడంతో రైతులు ఆందోళన చెందారు. పంటలను కాపాడుకునేందుకు రైతులు నానా ఇబ్బందలుఉ పడుతూ వర్షాలు ఎప్పుడు పడతాయా అని ఎదురు చూస్తున్న క్రమంలో తుఫాన్ ప్రభావంతో శుక్రవారం వర్షం పడటంతో సాగులో ఉన్న పంటలకు ప్రాణం పోసినట్లయింది.


