నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన తెలిపిన ఆర్బీఎస్కే సిబ్బంది
సంగారెడ్డి : ఉద్యోగాల క్రమబద్ధీకరణ, పనికి సమాన వేతనం, ఉద్యోగ భద్రత కల్పించాలని కోరుతూ జాతీయ ఆరోగ్య మిషన్ (ఎన్హెచ్ఎం) ఉద్యోగులు చేపట్టిన రాష్ట్రవ్యాప్త నిరవధిక సమ్మె 18వ రోజుకు చేరుకుంది. ఈ నెల 13 నుంచి కొనసాగుతున్న సమ్మెతో జిల్లావ్యాప్తంగా వైద్య సేవలకు ఆటంకం ఏర్పడింది. సమ్మెలో భాగంగా శుక్రవారం ఆర్బీఎస్కే సిబ్బంది నల్ల బ్యాడ్జీలు ధరించి జిల్లా ప్రభుత్వాస్పత్రిలో నిరసన తెలిపారు. ఈ సందర్భంగా జిల్లా సంయుక్త కార్యదర్శి నీలి శ్రీనివాస్ మాట్లాడుతూ...నీతి అయోగ్ ర్యాంకింగ్స్‌లో తెలంగాణ 11వ స్థానం నుంచి 3వ స్థానానికి చేరుకోవడంలో జాతీయ ఆరోగ్య మిషన్ ఉద్యోగుల కృషి ఎంతో ఉందన్నారు. ఉద్యోగులందరినీ క్రమబద్ధీకరించి, వారి సమస్యలను మానవీయ దక్పథంతో పరిష్కరించాలని ప్రభుత్వాన్ని కోరారు. కార్యక్రమంలో జిల్లా అధ్యక్షుడు డాక్టర్ ఇమ్రాన్ అహ్మద్, సుభాష్ జాదవ్, ఉపాధ్యక్షుడు డాక్టర్ ఆరీఫ్ అహ్మద్, నందలి అంజన్న, నీలి శ్రీనివాస్‌తోపాటు సిబ్బంది పాల్గొన్నారు.


