మైనింగ్‌ మాఫియా జిత్తులు | - | Sakshi
Sakshi News home page

మైనింగ్‌ మాఫియా జిత్తులు

Oct 30 2026 7:18 AM | Updated on Oct 30 2026 7:18 AM

ఆదాయాన్ని పెంచుకునేందుకు..

రాజకీయ అండదండలతో జిల్లాలో విచ్చలవిడిగా అక్రమ మైనింగ్‌కు మరిగిన మైనింగ్‌ మాఫియా ఎత్తుకు పై ఎత్తులు వేస్తోంది. గనులను ఆన్‌లైన్‌లో వేలం వేయడం ద్వారా గనులశాఖ ఆదాయాన్ని పెంచుకోవాలని భావిస్తున్న ప్రభుత్వ నిర్ణయానికి పథకం ప్రకారం గండి కొడుతోంది. లక్డారం స్టోన్‌–మెటల్‌ క్వారీ వేలం ప్రక్రియనే ఇందుకు నిదర్శనంగా నిలుస్తోంది.

–సాక్షిప్రతినిధి, సంగారెడ్డి

పటాన్‌చెరు మండలం లక్డారం శివారులోని 747 సర్వే నంబర్‌లో రెండెకరాల విస్తీర్ణంలో స్టోన్‌–మెటల్‌ క్వారీ కేటాయింపు కోసం భూగర్భ గనుల శాఖ టెండరు పిలిచింది. ఈ బ్లాకును దక్కించుకునేందుకు మొత్తం 13 మైనింగ్‌ కంపెనీలు బిడ్‌లు వేసేందుకు పోటీ పడ్డాయి. ఒక్కో దరఖాస్తుకు రూ.లక్ష చొప్పున చెల్లించి 13 టెండరు ఫారాలు కూడా కొనుగోలు చేశారు. కానీ కేవలం రెండు మైనింగ్‌ కంపెనీలు మాత్రమే టెండరు ప్రక్రియలో బిడ్‌లు దాఖలు చేశాయి. అత్యధికంగా రూ.5.54 కోట్లకు బిడ్‌ వేసిన ఓ కంపెనీకి ఈ బ్లాక్‌ అలాట్‌ అయింది. కానీ, ఈ మొత్తాన్ని చెల్లించేందుకు ఆ మైనింగ్‌ సంస్థ నిరాకరిస్తోంది. టెండరు ప్రక్రియలో పాల్గొన్న రెండో బిడ్డర్‌ కూడా ఆయా మొత్తాన్ని చెల్లించేందుకు ముందుకు రావడం లేదని సమాచారం. దీంతో ప్రభుత్వ ఖజానాకు జమ కావాల్సిన సొమ్ము ఆగిపోయింది.

అసలేం జరిగింది..?

జిల్లాలో అక్రమ మైనింగ్‌ విచ్చలవిడిగా సాగుతోంది. రాజకీయ అండదండలతో క్వారీలను దొడ్దిదారిన లీజుకు తీసుకుంటున్న ప్రజాప్రతినిధులు ఖనిజ సంపదను విచ్చలవిడిగా లూఠీ చేస్తున్నారు. ఇందులో అధికార కాంగ్రెస్‌తోపాటు, బీఆర్‌ఎస్‌, బీజేపీలకు చెందిన ప్రజాప్రతినిధులు, నేతల కుటుంబ సభ్యులు, వారి బినామీలు ఉన్నారు. అడ్డూ అదుపు లేకుండా ఖనిజ సంపదను తోడేస్తూ గనులశాఖకు చెల్లించాల్సిన సీనరేజీ, రాయల్టీలను యథేచ్ఛగా ఎగవేస్తున్నారు. ఏకంగా రూ.974 కోట్ల సీనరేజీ ఎగవేసిన 15 మైనింగ్‌ కంపెనీలకు గతేడాది గనులశాఖ డిమాండ్‌ నోటీసులు జారీ చేసిన వ్యవహారమే ఇందుకు ఉదాహరణగా చెప్పవచ్చు. చట్టంలోని లొసుగులను ఆసరాగా చేసుకుని ఎగవేసిన ఈ మొత్తాన్ని కూడా చెల్లించకుండా దొడ్డిదారులను వెతుకుతున్నాయి. ఇలా మైనింగ్‌ మాఫియా విచ్చలవిడిగా అక్రమ మైనింగ్‌కు మరిగింది. ఇప్పుడు టెండరు ద్వారా పోటీ పడి క్వారీలను తీసుకుని సక్రమంగా సీనరేజీ, రాయల్టీ చెల్లిస్తే వచ్చే దానికంటే అక్రమ మైనింగ్‌కు పాల్పడితే అంతకు పదింతలు దండుకోవచ్చని భావిస్తోంది. ఇలా వేలం విధానాన్ని నీరు గార్చిందనే ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. ఈ విషయమైన ‘సాక్షి’ప్రతినిధి భూగర్భ గనులశాఖ అసిస్టెంట్‌ డైరెక్టర్‌ హరిప్రసాద్‌ను వివరణ కోరగా..టెండరు ప్రక్రియ అంతా తమ రాష్ట్ర కార్యాలయం నిర్వహించిందని చెప్పారు. దరఖాస్తు ఫారాలు కొనుగోలు చేసిన వారిలో రెండు మైనింగ్‌ సంస్థలు టెండర్లు వేశాయన్నారు. బిడ్‌లో పేర్కొన్న మొత్తాన్ని చెల్లించేందుకు ఆ సంస్థలు ముందుకు రాలేదని తెలిపారు. దీనిపై రాష్ట్ర ఉన్నతాధికారులే నిర్ణయం తీసుకుంటారని పేర్కొన్నారు.

లక్డారం క్వారీకి రూ.5.54 కోట్లకు బిడ్‌

ఆ మొత్తాన్ని గనులశాఖకు చెల్లించకుండా చేతులెత్తేసిన మైనింగ్‌ సంస్థ

గనుల వేలం ద్వారా ఆదాయాన్ని పెంచుకోవాలనే సర్కారు నిర్ణయానికి గండి

రాష్ట్ర వ్యాప్తంగా గనుల క్వారీల కేటాయింపుల కోసం ప్రభుత్వం ఆన్‌లైన్‌ టెండరు విధానాన్ని అమలు చేస్తోంది. గనుల శాఖ ఆదాయాన్ని పెంచుకునేందుకు ఈ ఆర్థిక ఏడాది నుంచే ఈ విధానాన్ని అమలు చేస్తోంది. గతంలో ఎవరు దరఖాస్తు చేసుకుంటే వారికి ఈ క్వారీలను కేటాయించే వారు. టెండరు పిలువడం ద్వారా మైనింగ్‌ కంపెనీల్లో పోటీ ఏర్పడి ఆదాయం పెరుగుతుందని ప్రభుత్వం భావించింది. కానీ అక్రమాల్లో ఆరితేరిన మైనింగ్‌ కంపెనీలు జిమ్మిక్కులకు పాల్పడ్డాయి. సిండికేట్‌గా మారి వేలం ప్రక్రియను నీరుగార్చాయి. సర్కారు నిర్ణయానికి గండికొట్టాయని అనడానికి లాక్డారం బ్లాకు టెండరు ప్రక్రియనే నిదర్శనంగా చెప్పవచ్చు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement