సంగారెడ్డి జోన్: యువత మత్తు పదార్థాలను వీడి, మంచి అలవాట్లను పెంపొందించుకోవాలని ఎస్పీ పరితోశ్ పంకజ్ సూచించారు. జిల్లా ఆస్పత్రిలోని డీ–అడిక్షన్ కేంద్రాన్ని గురువారం ఆయన సందర్శించారు. ఎస్–నాబ్ ఆధ్వర్యంలో డీ–అడిక్షన్ కేంద్రానికి ఇండోర్ స్పోర్ట్స్ మెటీరియల్‌ను అందజేశారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ...మత్తు పదార్థాలకు బానిసలైన వారిని వ్యసనం నుంచి బయటపడేలా చేసి, సాధారణ జీవితాన్ని గడిపేలా చూడటమే ప్రధాన ఉద్దేశమన్నారు. వీటి వినియోగం వల్ల కలిగే అనర్థాలను వివరిస్తూ, చెడు అలవాట్లకు పూర్తిగా దూరంగా ఉండాలని సూచించారు. జీవితంలో మంచి మార్గంలో నడుస్తూ తమ కుటుంబాలకు ఆదర్శంగా నిలవాలన్నారు. ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగుతూ సమాజంలో గౌరవప్రదమైన జీవితాన్ని గడపాలన్నారు. కేంద్రానికి వచ్చే వారికి అవసరమైన వైద్య సేవలు అందించాలని సూచించారు. వైద్యపరమైన జాగ్రత్తలు పాటిస్తూ, కౌన్సెలింగ్ ద్వారా మత్తు పదార్థాల వ్యసనం నుంచి బయటపడేందుకు ప్రయత్నిస్తున్న వారికి తగిన సహకారం, ప్రోత్సాహం అందించాలన్నారు. కార్యక్రమంలో డాక్టర్ శ్రీలక్ష్మి, నోడల్ ఆఫీసర్, డా.మురళీకృష్ణ, సూపరింటెండెంట్ డాక్టర్.రవికుమార్, ఆర్‌ఎంఓ, డాక్టర్.పద్మావతి, ఆర్‌ఎంఓ, ఎస్–నాబ్ ఇన్‌స్పెక్టర్ నాగేశ్వర్‌రావు, తదితరులు పాల్గొన్నారు.
ఎస్పీ పరితోశ్ పంకజ్


