కేవీకే శాస్త్రవేత్త డాక్టర్ శ్రీనివాస్
నర్సాపూర్ రూరల్: ఎల్నినో ప్రభావం ఉన్నందున యాసంగిలో ఆరుతడి పంటలు సాగు చేసుకోవాలని కేవీకే శాస్త్రవేత్త డాక్టర్ శ్రీనివాస్ రైతులకు సూచించారు. మండలంలోని ఆవంచ రైతు వేదికలో సాగు భూమి సంరక్షణపై గురువారం నిర్వహించిన అవగాహన కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు. ప్రతీ రైతు యాసంగిలో తక్కువ నీటితో సాగయ్యే మొక్కజొన్న, కుసుమ, శనగ, పెసర, మినుము వంటి పంటలతో పాటు కూరగాయలు, ఇతర ప్రత్యామ్నాయ పంటలు సాగుచేసుకోవాలని సూచించారు. భూగర్భ జలాలపై ఒత్తిడి తగ్గించేందుకు పంటల మార్పిడి తప్పనిసరని తద్వారా నేల సారాన్ని మెరుగుపరచుకోవచ్చని తెలిపారు. రసాయన ఎరువుల వాడకాన్ని పూర్తిగా తగ్గించి సేంద్రీయ ఎరువులతో పంటలు సాగు చేసుకోవాలని వివరించారు. కార్యక్రమంలో సర్పంచ్ కర్ణాకర్, కార్యదర్శి మల్లేశ్, ఏఈఓ లావణ్య, రైతులు పాల్గొన్నారు.


