మారింది పోర్టలే! | - | Sakshi
Sakshi News home page

మారింది పోర్టలే!

Oct 29 2026 8:30 AM | Updated on Oct 29 2026 8:30 AM

సగానికి పైగా తహసీల్దార్ల వద్దే పెండింగ్‌ రెవెన్యూ అధికారుల పనితీరుపై తీవ్ర విమర్శలు

సాక్షిప్రతినిధి, సంగారెడ్డి: ధరణి స్థానంలో భూ భారతి పోర్టల్‌ వచ్చినా రైతుల భూ సమస్యలకు పరిష్కారం లభించడం లేదు. తమ భూ సమస్యను పరిష్కరించాలని సామాన్య రైతులు అధికారుల చుట్టూ నెలల తరబడి తిరుగుతున్నా..రెవెన్యూ అధికారులు పట్టించుకోవడం లేదు. ఇందుకు పెండింగ్‌లో ఉన్న భూ భారతి దరఖాస్తుల సంఖ్యనే నిదర్శనం. పదుల్లో కాదు.. వందల్లో కాదు..ఏకంగా 8,500లకు పైగా భూ భారతి దరఖాస్తులు పెండింగ్‌లో ఉన్నాయంటే ఈ శాఖ అధికారుల అలసత్వం ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. జెడ్పీ సమావేశం హాలులో బుధవారం జరిగిన ఉమ్మడి మెదక్‌ జిల్లా సమీక్షలో ఈ భూ భారతి దరఖాస్తుల అంశం ప్రధానంగా చర్చకొచ్చింది. కొండలా పేరుకుపోయిన ఈ పెండింగ్‌ దరఖాస్తులను పరిష్కరించడంలో జరుగుతున్న జాప్యంపై మంత్రి పొంగులేటి తీవ్ర అసహనం వ్యక్తం చేసినట్లు సమాచారం. అధికారుల పనితీరు మార్చుకోకపోతే కఠిన చర్యలు ఉంటాయని కూడా హెచ్చరించారు.

తహసీల్దార్ల వద్ద సగానికిపైగా..

జిల్లాలో ప్రస్తుతం భూ భారతి దరఖాస్తులు 8,514 పెండింగ్‌లో ఉన్నాయి. ఇందులో సగానికి పైగా 4,667 దరఖాస్తులు తహసీల్దార్ల వద్దే పెండింగ్‌లో ఉండటం గమనార్హం. ప్రధానంగా పటాన్‌చెరు, రామచంద్రాపురం, సదాశివపేట, సంగారెడ్డి, హత్నూర, జిన్నారం, కొండాపూర్‌, కంది, అమీన్‌పూర్‌ మండలాల్లో ఈ పెండింగ్‌ దరఖాస్తుల సంఖ్య అధికంగా ఉంది. హెచ్‌ఎండీఏ పరిధిలోని ఈ మండలాల్లో అపరిష్కృత దరఖాస్తులు ఎక్కువగా ఉండటం గమనార్హం. ఆర్డీఓలు, అదనపు కలెక్టర్ల లాగిన్‌లలోనూ రెండు వేలకు పైగా దరఖాస్తులు పెండింగ్‌లో ఉన్నట్లు గణాంకాలు చెబుతున్నాయి. నిషేధిత జాబితాలోంచి తమ భూములను తొలగించాలని, సక్సేషన్‌, మ్యూటేషన్‌, ఆర్‌ఓఆర్‌, విస్తీర్ణంలో వ్యత్యాసాలు, సబ్‌డివిజన్‌, నాలా కన్వర్షన్‌లు, పట్టాదారు పాసుపుస్తకాలు రాకపోవడం తదితర భూసమస్యలపై రైతులు ఎక్కువగా భూ భారతి పోర్టల్‌లో దరఖస్తులు చేసుకుంటున్నారు.

అపరిష్కృతంగా 8,500లకు పైగా భూ భారతి దరఖాస్తులు

ముడుపులిస్తేనే మోక్షమా..?

సాధారణ రైతులు తమ భూసమస్యల పరిష్కారం నెలల తరబడి రెవెన్యూ అధికారుల చుట్టూ చెప్పులరిగేలా తిరుగుతున్నారు. వీరిని కనీసం పట్టించుకోని కొందరు రెవెన్యూ అధికారుల రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారులు, రాజకీయ పలుకుబడి ఉన్నవారి, బడాబాబుల దరఖాస్తులను మాత్రం ఆగమేఘాలపై పరిష్కరిస్తున్నారనే విమర్శలున్నాయి. పెద్ద మొత్తంలో ముడుపులు ముట్టజెపితేనే ఈ దరఖాస్తులకు తక్షణం మోక్షం లభిస్తోందనే ఆరోపణలున్నాయి. సాధారణ రైతుకు నిబంధనల పేరుతో సాకులు చెప్పే అధికారులు వీరికి మాత్రం నిబంధనలను కూడా పక్కనబెట్టి పనులు చక్కబెడుతున్నారనే విమర్శలున్నాయి. క్షేత్రస్థాయి విచారణలు..నివేదికల పేరుతో తీవ్ర జాప్యం చేస్తున్నారు. ఇటీవల జరిగిన సమీక్షలో రెవెన్యూ మంత్రి చేసిన హెచ్చరికలతోనైనా ఈ అధికారుల తీరు మారి..తమ దరఖాస్తులకు మోక్షం లభించాలని సామాన్య రైతులు కోరుతున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement