జహీరాబాద్ టౌన్: చెరకు పంట పండించే రైతుల జీవితాల్లో కష్టాలు చేదు మిగులుస్తున్నాయి. ఒకవైపు వర్షాభావం, మరోవైపు బలమైన ఈదురుగాలులు, అడవి పందుల దాడితో చెరకు రైతులు కోలుకోలేని దెబ్బతింటున్నారు. వర్షాలు లేక పంట ఎదుగుదల దెబ్బతింటే.. ఇటీవల వీచిన గాలులకు ఎకరాలకు ఎకరాలు చెరకు నేలకొరిగింది. ఇలా పడిపోయిన పంటను కాపాడుకునేందుకు ’జుడి’ కట్టించేందుకు ఎకరానికి రూ.6 వేల వరకు అదనపు భారం పడుతోందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దీనికి తోడు రాత్రి వేళల్లో గుంపులుగా వస్తున్న అడవి పందులు చెరకు గడలను నమిలి ధ్వంసం చేస్తున్నాయి. అలాగే కూలీల కొరతతో అప్పులు చేసి మరీ పంటను కాపాడుకోవాల్సి వస్తోందని వాపోతున్నారు. తీవ్ర నష్టాల్లో ఉన్న తమను ఆదుకునేందుకు ప్రభుత్వాలు స్పందించి చెరకుకు మద్దతు ధరతో పాటు టన్నుకు రూ.500 బోనస్ ప్రకటించాలని డిమాండ్ చేస్తున్నారు.


