మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి
సదాశివపేట రూరల్(సంగారెడ్డి): రైతుల అవసరాలే లక్ష్యంగా గంగకత్వ కాలువ పనులను త్వరితగతిన చేపట్టాలని సంగారెడ్డి మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి అధికారులకు సూచించారు. మండలంలోని సూరారం శివారులోని గంగకత్వ ప్రాజెక్టు, కాలువ ఆధునీకరణకు రూ.37 కోట్లు మంజూరైన నేపథ్యంలో బుధవారం ఆయన గంగకత్వ ప్రాజెక్ట్ కాలువను పరిశీలించారు. అనంతరం సాగునీటి శాఖ అధికారులు, ఆయకట్టు గ్రామాల రైతులు, స్థానిక నాయకులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ...గంగకత్వ కాలువ పరిధిలోని 11 గ్రామాల్లో 3,300 ఎకరాల ఆయకట్టుకు సాగునీరు అందించే అవకాశం ఉందన్నారు. సదాశివపేట మండలంలో సుమారు 16 కిలోమీటర్ల మేర విస్తరించిన కాలువకు 28 చెరువులు అనుసంధానమై ఉన్నాయని చెప్పారు. కాలువను ఆధునీకరించి, చివరి ఆయకట్టు వరకు నీరందించడమే లక్ష్యమని పేర్కొన్నారు. రూ.37 కోట్లు మంజూరు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసిన మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు. గంగకత్వ ఆధునీకరణకు అదనంగా వాగుపై ఏడు చోట్ల చెక్‌డ్యామ్‌ల నిర్మాణానికి ప్రతిపాదనలు సిద్ధమవుతున్నాయని తెలిపారు. దీపావళి తర్వాత శంకుస్థాపన జరిగేలా చూస్తామని జగ్గారెడ్డి తెలిపారు.డిసెంబర్‌లోపు టెండర్ల ప్రక్రియ పూర్తయ్యేలా చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. కార్యక్రమంలో సీడీసీ చైర్మన్ రాంరెడ్డి, ఇరిగేషన్ అధికారులు, ప్రజాప్రతినిధులు, నాయకులు తదితరులు పాల్గొన్నారు.


