కొండపాక(గజ్వేల్): ఇంటి తాళాలు పగులగొట్టి బీరువాలో నుంచి గుర్తుతెలియని వ్యక్తులు బంగారు ఆభరణాలు ఎత్తుకెళ్లారు. ఈసంఘటన మండలంలోని తిమ్మారెడ్డిపల్లిలో బుధవారం చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన గౌరాయిపల్లి రాజు డీసీఎం డ్రైవర్‌గా పని చేస్తున్నారు. మంగళవారం వృత్తి రీత్యా బయటకు వెళ్లగా, భార్య లక్ష్మి హైదారాబాద్‌లో ఉంటున్న కొడుకు వద్దకు వెళ్లింది. పని ముగించుకొని రాజు బుధవారం ఇంటికి వచ్చే సరికి ఇంటి తాళాలు పగులగొట్టి ఉన్నాయి. ఇంట్లోకి వెళ్లి చూడగా బీరువాలోంచి రూ. 30 వేల నగదుతో పాటు సుమారు రెండు తులాల బంగారు ఆభరణాలు అపహరణకు గురయ్యాయి. వీటి విలువ సుమారు రూ. 3 లక్షల పైచిలుకు ఉంటుందన్నారు. ఈవిషయమై కుకునూరుపల్లి పోలీస్టేషన్‌లో ఫిర్యాదు చేసినట్లు బాధితుడు తెలిపాడు. ఎస్సై బాలకృష్ణ ఘటనా స్థలికి చేరుకొని పరిశీలించారు. క్లూస్ టీంను రప్పించి వేలిముద్రలు తదితర ఆధారాలను సేకరించారు. విచారణ వేగవంతం చేసి త్వరలోనే దొంగలను పట్టుకుంటామన్నారు.
రూ.30 వేల నగదు, బంగారు ఆభరణాల అపహరణ


