సిద్దిపేటరూరల్: కేంద్ర దత్తత ప్రాధికారిత సంస్థ ద్వారా అందిస్తున్న దత్తత ప్రక్రియను వేగవంతం చేయాలని సంస్థ జూనియర్ ప్రొఫెషనల్ లివియా మరియంపాల్ అన్నారు. బుధవారం కలెక్టరేట్లో మహిళా అభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో దత్తత ప్రక్రియకు సంబంధించి జిల్లాల వారీగా సమీక్ష నిర్వహించారు. ఈసందర్భంగా దత్తతకు సంబంధించిన కేసుల ప్రస్తుత స్థితి, పెండింగ్ కేసులు, వాటి పరిష్కారానికి తీసుకోవాల్సిన చర్యల గురించి అడిగి తెలుసుకున్నారు. ముఖ్యంగా చైల్డ్ కేర్ ఇన్స్టిట్యూట్లో సంరక్షణ పొందుతున్న పిల్లల్లో చట్టపరమైన దత్తత ప్రక్రియను వేగవంతం చేయాలన్నారు. సమావేశంలో సిద్దిపేట, సూర్యాపేట, వరంగల్, జనగామ, యాదాద్రి భువనగిరి జిల్లాలకు చెందిన సంబంధిత శాఖల అధికారులు, ప్రతినిధులు పాల్గొన్నారు.


