● పోలీసులకు సవాలుగా మారిన దొంగతనాలు ● మరమ్మతులకు నోచుకొని సీసీ కెమెరాలు
సంగారెడ్డి క్రైమ్: జిల్లా కేంద్రమైన సంగారెడ్డిలో దొంగతనాలు రోజు రోజుకి పెరిగిపోతున్నాయి. వరుస దొంగతనాలు పోలీసులకు సవాలుగా మారాయి. ప్రజలు సైతం తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. సంగారెడ్డి పట్టణంలోని కల్వకుంట కాలనీలో ఒకేరోజు మూడో ఇళ్లల్లో చోరీ జరిగింది. తాళం వేసిన మూడు ఇళ్లల్లో దొంగలు పడ్డారు. ఇలా వరుస దొంగతనాలు పట్టణ వాసులకు భయాందోళనకు గురవుతున్నారు. ఎప్పుడు ఎక్కడ దొంగతనాలు జరుగుతాయోనన్న భయంతో ప్రజలు వణికి పోతున్నారు. పగలు రెక్కి నిర్వహించి రాత్రి వేళల్లో చోరీకి పాల్పడుతున్నారు. అభివృద్ధి చెందుతున్న సాంకేతిక పరిజ్ఞానంతో దొంగలపై పోలీసులు నీఘూ పెడుతున్నా చోరీలు మాత్రం ఆగడటంలేదు. కాగా ఆయా కాలనీలో సీసీ కెమెరాలు మరమ్మతులకు నోచుకోకపోవడం కూడా దొంగలకు వరంలా మారాయి.
నెల వ్యవధిలోనే..
ప్రధాన ఇళ్లను లక్ష్యంగా చేసుకొని దొంగలు చెలరేగిపోతున్నారు. నెల వ్యవధిలో జిల్లాలో ఐదు నుంచి ఆరు చోట్ల చోరీలు జరుగుతున్నాయంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. ఇటీవల కాలంలో ప్రధాన రహదారి పక్కన ఉన్న ఇంట్లో చోరికి పాల్పడటం స్థానికుల్లో కలవరం రేపుతోంది. కేవలం కేసులు నమోదు తప్ప రికవరీపై పోలీసులు దృష్టి సాధించడం లేదని ప్రజలు, బాధితులు వాపోతున్నారు.
ఇటీవల జరిగిన ఘటనలు
● ఈ నెల 17న పట్టణంలోని కల్వకుంట కాలనీలో తాళం వేసిన ఇంట్లో రూ.5 లక్షల విలువైన ఆభరణాలతో పాటు స్మార్ట్ ఫోన్లను దుండగులు దోచుకెళ్లారు.
● ఈ నెల 6న న్యాల్‌కల్ మండలం కలేబేమల్ గ్రామంలో దుండగులు ఇంట్లో చోరబడి సుమారు రూ. లక్షన్నర నగదు, అర తులం బంగారు ఆభరణాన్ని ఎత్తుకెళ్లారు.
● ఈ నెల 5న కంది మండలం స్థానిక జామ్‌జామ్ దాబా ఆవరణలో ఇంటి ముందు పార్కు చేసిన ద్విచక్ర వాహనాన్ని గుర్తుతెలియని వ్యక్తులు ఎత్తుకెళ్లారు.
పెరిగిన క్రైౖమ్ రేటు..
మరోవైపు అపార్ట్‌మెంట్లలోకి, ఇంట్లోకి చొరబడి బంగారు ఆభరణాలు, లక్షల రూపాయలు నగదు దోచుకెళ్తున్న ఘటనలు సైతం పెరుగుతున్నాయి. నెల రోజుల వ్యవధిలో పట్టణంలో ఒకే చోట జరిగిన మూడు చోరీ ఘటనలు నేటికీ మిస్టరీగానే ఉన్నాయి. పోలీసులు బందోబస్తు పేరుతో వీధుల్లో పెట్రోలింగ్ విస్మరిస్తుండటంతో దొంగలు పక్కగా రెక్కి నిర్వహించి, చోరీలకు పాల్పడుతున్నారని ప్రజలు ఆరోపిస్తున్నారు. ఉన్నతాధికారులు దృష్టి సారించి, చోరీలకు కళ్లెం వేయాల్సిన అవసరం ఉందని ప్రజలు అంటున్నారు.
పనిచేయని సీసీ కెమెరాలు
ప్రజల భద్రత, నేరాల నియంత్రణ, చోరీలను అరికట్టేందుకు పోలీస్ శాఖ ఆధ్వర్యంలో ప్రధాన రహదారి వెంబడి దాదాపు 100 సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. అయితే ఐదు నెలలుగా కెమెరాలకు సంబంధించిన వైర్లు తెగిపోవడం, సీసీ కెమెరాలు దెబ్బతినడంతో పనిచేయడం లేదు. రాత్రి వేళల్లో పోలీసులు నీఘా గట్టిగా ఉంటే చోరీలను అరికట్టే అవకాశం ఉంది. అలాగే ప్రధాన రహదారుల్లోని సీసీ కెమెరాలకు మరమ్మతులు చేపట్టి నీఘా పెంచాలని ప్రజలు కోరుతున్నారు.
దర్యాప్తు ముమ్మరం చేస్తున్నాం
ప్రధాన రహదారుల్లో గస్తీ ముమ్మరం చేశాం. పట్టణంలో వరుస చోరీల నేపథ్యంలో నిందితుల కోసం ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి, గాలింపు చర్యలు చేపట్టాం. త్వరలోనే నిందితులను అరెస్ట్ చేసి బాధితులకు న్యాయం చేసేలా చూస్తాం.
– రామునాయుడు, పట్టణ సీఐ


