చట్టాలపై అవగాహన అవసరం | - | Sakshi
Sakshi News home page

చట్టాలపై అవగాహన అవసరం

Oct 29 2026 8:30 AM | Updated on Oct 29 2026 8:30 AM

చట్టాలపై అవగాహన అవసరం మందుబాబులకు జైలు శిక్ష ఆర్థిక ఇబ్బందులతో వ్యక్తి ఆత్మహత్య

సిద్దిపేటరూరల్‌: విద్యార్థులు గుడ్‌టచ్‌ బ్యాడ్‌టచ్‌, బాలల హక్కులు, చట్టాలపై అవగాహన కలిగి ఉండాలని జిల్లా న్యాయసేవాధికార సంస్థ కార్యదర్శి సౌజన్య విద్యార్థులకు సూచించారు. బుధవారం మండల పరిధిలోని ఇర్కోడ్‌ ఆదర్శ పాఠశాలలో సురక్షిత్‌ బచ్‌పన్‌ అభియాన్‌ కార్యక్రమానికి ఆమె ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. ఎవరైనా అనుచితంగా ప్రవర్తిస్తే భయపడకుండా తల్లిదండ్రులకు, ఉపాధ్యాయులు, నమ్మకమైన వ్యక్తులకు చెప్పాలన్నారు. బాలల భద్రత ప్రతీ ఒక్కరి బాధ్యతని అన్నారు. కార్యక్రమంలో పిన్సిపాల్‌ రవీందర్‌గౌడ్‌, మానసిక వైద్యులు స్వర్ణకుమారి, ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు.

సిద్దిపేటకమాన్‌: మద్యం తాగి వాహనాలు నడుపుతూ పట్టుబడిన వాహనదారులకు సిద్దిపేట కోర్టు జైలు శిక్ష విధించింది. సిద్దిపేట టూటౌన్‌ సీఐ మురళి కథనం ప్రకారం.. పట్టణంలోని నర్సాపూర్‌ రోడ్డులో తమ సిబ్బందితో కలిసి నిర్వహించిన వాహన తనిఖీల్లో ఇద్దరు మద్యం తాగి వాహనాలు నడుపుతూ పట్టుబడ్డారు. వారిని సిద్దిపేట కోర్టులో హాజరుపర్చగా బుధవారం విచారణ జరిపిన న్యాయమూర్తి ఇద్దరికి ఐదు రోజుల జైలు శిక్ష విధించినట్లు సీఐ తెలిపారు. మద్యం తాగి వాహనాలు నడపకూడదని, రోడ్డు ప్రమాదాల నివారణకు ప్రతిరోజు వాహనాల తనిఖీ నిర్వహిస్తున్నట్లు సీఐ తెలిపారు.

పటాన్‌చెరు టౌన్‌: డ్రంకెన్‌ డ్రైవ్‌లో పట్టుబడ్డ వాహనదారులకు సంగారెడ్డి జిల్లా కోర్టు జరిమానా విధించినట్లు ట్రాఫిక్‌ సీఐ ప్రసాద్‌ రావు తెలిపారు. మంగళవారం రాత్రి నిర్వహించిన తనిఖీల్లో మద్యం తాగి వాహనాలు నడుపుతూ 11 మంది పట్టుబడ్డారని తెలిపారు. పట్టుబడిన వాహనదారులను బుధవారం సంగారెడ్డి కోర్టులో హాజరు పరచగా, న్యాయమూర్తి అందులోని ఆరుగురికి కలిపి రూ. 14,000 జరిమానా విధించినట్లు సీఐ వివరించారు. మద్యం తాగి వాహనాలు నడిపితే కఠిన చర్యలు తప్పవని వాహనదారులను హెచ్చరించారు.

రామాయంపేట (మెదక్‌): మండలంలోని ఆర్‌. వెంకటాపూర్‌ గ్రామానికి చెందిన శివ్వాయపల్లి నరేశ్‌ (35) బుధవారం ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ప్లంబర్‌గా పని చేస్తున్న నరేశ్‌కు భార్య, కుమారుడు ఉన్నారు. భార్య నార్లాపూర్‌లోని పుట్టింటికి వెళ్లిన సమయంలో గ్రామ శివారులోని అటవీ ప్రాంతంలో చెట్టుకు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఆర్థిక ఇబ్బందులే కారణమని గ్రామస్తులు తెలిపారు. గ్రామ సర్పంచ్‌ ఉమ మృతుడి కుటుంబాన్ని పరామర్శించి రూ.10 వేల ఆర్థిక సాయం అందజేశారు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.

కడుపునొప్పితో..

నర్సాపూర్‌ రూరల్‌: పట్టణానికి చెందిన సూరారం రమేశ్‌(40) దీర్ఘకాలిక కడుపునొప్పితో బాధపడుతూ మంగళవారం రాత్రి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. పోలీసుల వివరాల ప్రకారం.. రమేశ్‌ గత నాలుగేళ్లుగా కడుపునొప్పితో బాధపడుతూ పలు ఆస్పత్రుల్లో చికిత్స తీసుకున్నప్పటికీ ఉపశమనం లభించలేదు. దీంతో మనస్తాపానికి గురై ఇంట్లోని ఓ గదిలో ఉరివేసుకొని మృతి చెందాడు. రమేశ్‌ మహ్మదాబాద్‌ గిరిజన ఆశ్రమ పాఠశాలలో తాత్కాలిక ఉపాధ్యాయుడిగా పనిచేస్తూ కుటుంబాన్ని పోషించేవాడు. ఆయనకు భార్య సుష్మ, కుమారుడు సాయి (10), కుమార్తె వర్ణిక (8) ఉన్నారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

ఆర్థిక ఇబ్బందులతో..

నిజాంపేట(మెదక్‌): ఆర్థిక ఇబ్బందులతో మద్యానికి బానిసై ఓ వ్యక్తి ఆత్మహత్య చేసుకున్న సంఘటన నిజాంపేట మండల పరిధిలోని నార్లాపూర్‌ గ్రామంలో చోటు చేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. నార్లాపూర్‌ గ్రామానికి చెందిన కాశమైన నర్సింలు (45), కూలి పనులు చేసుకుంటూ జీవనం కొనసాగిస్తున్నాడు. కుటుంబ అవసరాల నిమిత్తం డ్వాక్రా గ్రూపులో తీసుకున్న అప్పును వారం, నెలవారీగా చెల్లించాల్సి ఉండగా, ఆ డబ్బులు సరిగ్గా కట్టలేకపోయాడు. భార్య యాదమ్మ, పెద్ద కూతురు స్నేహతో కలిసి సిద్దిపేటలో ఉంటూ కూలి పనులు చేసుకుంటున్నారు. భార్య యాదమ్మ అనారోగ్యం, డ్వాక్రా డబ్బులు కట్టలేకపోవడంతో మనస్తాపం చెంది నర్సింలు మద్యానికి బానిసయ్యాడు. ఈ క్రమంలో మంగళవారం రాత్రి ఇంట్లో ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు.ఈ విషయమై మృతుడి భార్య యాదమ్మ ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని రామాయంపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement