చికిత్స పొందుతూ యువకుడి మృతి | - | Sakshi
Sakshi News home page

చికిత్స పొందుతూ యువకుడి మృతి

Oct 29 2026 8:30 AM | Updated on Oct 29 2026 8:30 AM

దుబ్బాకటౌన్‌: ఇంటి నిర్మాణం కోసం చేసిన అప్పులు తీర్చే మార్గం లేక మనోవేదనకు గురై పురుగు మందు తాగి యువకుడు చికిత్స పొందుతూ మృతి చెందాడు. ఈ ఘటన రాయపోల్‌ మండలం రాంసాగర్‌లో మంగళవారం రాత్రి చోటు చేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. గ్రామానికి చెందిన కల్లూరి యాదగిరి(32) సొంత ఇంటిని నిర్మించుకోవడానికి మూడేళ్ల క్రితం వెటరన్‌ ప్రైవేట్‌ ఫైనాన్స్‌లో రూ.5 లక్షలు లోన్‌ తీసుకొని ఇల్లు నిర్మించుకొన్నారు. ఇంటి ఖర్చులు, కాపురం విషయంలో మరింత అప్పు చేశారు. ఇటు అప్పులు వాయిదాల ప్రకారం చెల్లిస్తున్నప్పటికీ గత కొన్ని నెలలుగా ఫైనాన్స్‌ అప్పు తీర్చలేక తరచూ ఇంట్లో బాధపడుతుండేవాడు. ఈనెల 8న రాత్రి మద్యం సేవించి ఇంటికి వచ్చి నిద్రపోయాడు. 9న ఉదయం 4 గంటలకు కడుపులో నొప్పి వస్తుందని చెప్పగా, చికిత్స నిమిత్తం గజ్వేల్‌ ప్రైవేట్‌ ఆస్పత్రికి తరలించారు. అక్కడి నుంచి హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్‌ ఆస్పత్రికి తరలించారు. పరిశీలించిన వైద్యులు గడ్డి మందు తాగినట్లు ధ్రువీకరించారు. అక్కడి నుంచి మెరుగైన వైద్యం కోసం ఈనెల 17న నిమ్స్‌ ఆస్పత్రిలో చేర్పించారు. అక్కడ చికిత్స పొందుతూ మంగళవారం రాత్రి 8 గంటలకు మృతి చెందాడు. మృతుడి భార్య మహేశ్వరి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ లింగం తెలిపారు.

గుర్తు తెలియని వ్యక్తి ..

మద్దూరు(హుస్నాబాద్‌): మండలంలోని వల్లంపట్లలో గుర్తు తెలియని వ్యక్తి మృతి చెందినట్లు ఎస్‌ఐ మహ్మద్‌ ఆసీఫ్‌ తెలిపారు. గ్రామంలో ఈనెల 20న ఓ ఇంటి వద్ద 70– 80 ఏళ్ల మధ్య వయసు ఉన్న గుర్తు తెలియని వృద్ధుడు అపస్మారక స్థితిలో పడి ఉన్నారన్నారు. దీనిని గమనించిన గ్రామానికి చెందిన గజ్జెల మహేందర్‌ వెంటనే 108కు ఫోన్‌ చేయగా, వెంటనే అతడిని సిద్దిపేట ప్రభుత్వ ఆస్పత్రికి తరలించినట్లు చెప్పారు. ఈక్రమంలో చికిత్స పొందుతూ వృద్ధుడు బుధవారం మృతి చెందినట్లు తెలిపారు. ఈఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. మృతిచెందిన వృద్ధుడి వివరాలు తెలిస్తే 8712667357, 8712667474 నంబర్లలో సంప్రదించాలన్నారు.

ఆర్టీసీ డ్రైవర్‌..

సిద్దిపేటఅర్బన్‌: ముందు వెళ్తున్న లారీని ఢీకొన్న ఘటనలో గాయపడిన ఆర్టీసీ బస్సు డ్రైవర్‌ చికిత్స పొందుతూ మృతి చెందాడు. త్రీటౌన్‌ సీఐ లక్ష్మీబాబు కథనం ప్రకారం.. మంచిర్యాల డిపోనకు చెందిన ఆర్టీసీ బస్సు మంగళవారం సిద్దిపేట మీదుగా హైదరాబాద్‌ వెళ్తుంది. ఈ క్రమంలో సిద్దిపేట అర్బన్‌ మండలం పొన్నాల రాజీవ్‌ రహాదారి దాబాల వద్దకు అర్ధరాత్రి 2 గంటల సమయంలో చేరుకోగా ముందు వెళ్తున్న లారీ డ్రైవర్‌ ఒక్కసారిగా బ్రేకులు వేశాడు. దీంతో లారీని వెనక నుంచి బస్సు ఢీకొట్టడంతో డ్రైవర్‌ సదాల శ్రీనివాస్‌ (58) ఛాతీ పై తీవ్రగాయాలయ్యాయి. తీవ్రంగా గాయపడిన డ్రైవర్‌ను సిద్దిపేట ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ప్రాథమిక చికిత్స అనంతరం మెరుగైన చికిత్స నిమిత్తం వైద్యుల సూచన మేరకు గాంధీ ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ మృతి చెందాడు. మృతుడి కుమారుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్టు సీఐ తెలిపారు.

గుర్తుతెలియని వృద్ధుడు..

రామాయంపేట(మెదక్‌): స్థానిక మున్సిపాలిటీ పరిధిలోని గుల్పర్తి గ్రామ శివారులో సోమవారం తెల్లవారుజామున వరి చేనులో పడి గుర్తు తెలియని వృద్ధుడు మృతి చెందాడు. ఒడ్డు దాటుతున్న క్రమంలో అతడు ప్రమాదవశాత్తు కిందపడి మృతి చెంది ఉంటాడని గ్రామస్తులు, పోలీసులు భావిస్తున్నారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement