● దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పగించిన స్థానికులు
● బాధితురాలికి బంగారు గొలుసు అప్పగింత
జిన్నారం (పటాన్చెరు): పొలంలో పనిచేస్తున్న మహిళ మెడలో నుంచి బంగారు గొలుసు తెంచుకెళ్లేందుకు యత్నించిన ఇద్దరు దుండగులను స్థానికులు పట్టుకుని పోలీసులకు అప్పగించారు. ఈ సంఘటన జిన్నారం పోలీస్స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. స్థానికులు, పోలీసుల కథనం ప్రకారం.. జిన్నారం మండల పరిధిలోని సోలక్పల్లికి చెందిన జింకల మానెమ్మ (55) గ్రామ శివారులోని తన పంట పొలంలో పనిచేస్తోంది. ఆమె ఒంటరిగా ఉండటాన్ని గమనించిన హత్నూర మండలం ముచ్చర్లకి చెందిన మీనంపల్లి అరవింద్, వడ్డే సాయికుమార్లు ఆమె వద్దకు వెళ్లారు. వెంటనే ఆమె నోరు, ముక్కు మూసి మెడలో ఉన్న సుమారు 3 తులాల బంగారు గొలుసును లాక్కొని పారిపోయేందుకు యత్నించారు. వెంటనే బాధితురాలు గట్టిగా కేకలు వేయడంతో సమీప పొలాల్లో పనిచేస్తున్న రైతులు, కూలీలు వెంటనే స్పందించారు. పారిపోతున్న దుండగులను వెంటాడి పట్టుకుని దేహశుద్ధి చేశారు. నిందితుల వద్ద నుంచి బంగారు గొలుసును స్వాధీనం చేసుకుని బాధితురాలికి అందజేశారు. అనంతరం నిందితులిద్దరిని జిన్నారం పోలీసులకు అప్పగించారు. ఈ మేరకు బాధితురాలి ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.


