జాతీయస్థాయి కుస్తీ పోటీలకు విద్యార్థి | - | Sakshi
Sakshi News home page

జాతీయస్థాయి కుస్తీ పోటీలకు విద్యార్థి

Oct 28 2026 8:24 AM | Updated on Oct 28 2026 8:24 AM

జాతీయస్థాయి కుస్తీ పోటీలకు విద్యార్థి పద్మజకు డాక్టరేట్‌ కల్వర్టును ఢీకొని కారు దగ్ధం బాలికను అపహరించిన యువకుడికి ఏడేళ్ల జైలు

నారాయణఖేడ్‌: ఖేడ్‌ మండలం జూకల్‌ శివారులో స్కూల్‌గేమ్స్‌ ఫెడరేషన్‌ ఆధ్వర్యంలో నిర్వహించిన అండర్‌–14 రాష్ట్ర స్థాయి కుస్తీ పోటీల్లో విద్యార్థి సత్తాచాటాడు. పెద్దశంకరంపేట మహత్మా జ్యోతిబాపూలే బీసీ బాలుర గురుకుల విద్యార్థి సోమనాథ్‌ రాష్ట్రస్థాయి పోటీల్లో ప్రతిభ చాటి త్వరలో ఢిల్లీలో జరగబోయే జాతీయ స్థాయి కుస్తీ పోటీలకు ఎంపికయ్యాడు. ప్రిన్సిపాల్‌ ప్రతిభతో పాటు ఉపాధ్యాయులు, సిబ్బంది విద్యార్థిని అభినందించి ధృవపత్రం అందజేశారు. ఈ విజయం మరెందరో విద్యార్థులకు స్ఫూర్తిదాయకమని కొనియాడారు.

సిద్దిపేట ఎడ్యుకేషన్‌: భారతీయ పసుపు ఎగుమతుల పోటీతత్వంపై చేసిన తన పరిశోధనకు గాను ఆర్థిక శాస్త్రంలో డాక్టరేట్‌ లభించినట్లు సిద్దిపేటకు చెందిన పొన్నమనేని పద్మజ తెలిపారు. హైదరాబాద్‌లోని సెంటర్‌ ఫర్‌ ఎకనామిక్‌ అండ్‌ సోషల్‌ స్టడీస్‌ (సెస్‌) ఆర్థికశాస్త్ర విభాగం ప్రొఫెసర్‌ రేవతి పర్యవేక్షణలో పరిశోధన చేసినట్లు ఆమె తెలిపారు. ‘ఎక్స్‌పోర్ట్‌ కాంపిటీటివ్‌నెస్‌ ఆఫ్‌ ఇండియన్‌ టర్మరిక్‌: ఎ పోస్ట్‌ డబ్ల్యూటీవో అనాలిసిస్‌’ అనే అంశంపై సమర్పించిన సిద్ధాంత గ్రంథానికి తెలంగాణ విశ్వవిద్యాలయం ఆమోదం తెలిపిందని పద్మజ తెలిపారు. ఈ పరిశోధనలో ప్రపంచ వాణిజ్య సంస్థ (డబ్ల్యూటీవో) ఏర్పాటుకు అనంతర కాలంలో భారతీయ పసుపు ఎగుమతుల తీరుతెన్నులు, అంతర్జాతీయ మార్కెట్‌లో పోటీతత్వం వంటి అంశాలను విశ్లేషించినట్లు పరిశోధన శీర్షిక ద్వారా వివరించారు. భవిష్యత్తులో ఈ పరిశోధన అంశాలు పసుపు ఎగుమతులపై మరింత అధ్యయనం చేసేందుకు ఉపయోగపడే అవకాశం ఉందని పద్మజ పేర్కొన్నారు.

భీమదేవరపల్లి: అడవిపందిని తప్పించబోయి కారు అదుపుతప్పి కల్వర్టును ఢీకొట్టడంతో మంటలు లేచి పూర్తిగా దగ్ధమైంది. ఈ ఘటన హనుమకొండ జిల్లా భీమదేవరపల్లి మండలంలో సోమవారం అర్ధరాత్రి చోటుచేసుకుంది. స్థానికులు, పోలీసుల కథనం ప్రకారం.. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్‌ మండలం పోతారం గ్రామానికి చెందిన నలుగురు వ్యక్తులు కారులో హనుమకొండ నుంచి స్వగ్రామానికి బయలుదేరారు. మార్గమధ్యలో గట్ల నర్సింగాపూర్‌–మంగళపల్లి శివారులోకి రాగానే, అడ్డువచ్చిన అడవి పందిని తప్పించబోయి కారు అదుపుతప్పి పక్కనే ఉన్న కల్వర్టును ఢీ కొట్టింది. ఒక్కసారిగా కారులో మంటలు చెలరేగాయి. అప్రమత్తమైన వారు కారులోంచి బయటకు రావడంతో ప్రాణాపాయం తప్పింది. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తెచ్చారు. అప్పటికే కారు పూర్తిగా కాలి బూడిదైంది. పోలీసులు కేసు నమోదు చేశారు.

చేగుంట(తూప్రాన్‌): బాలికను నమ్మించి అపహరించిన యువకుడికి ఏడేళ్ల జైలు శిక్ష విధిస్తూ జిల్లా ఫాస్ట్‌ట్రాక్‌ పోక్సో కోర్టు మంగళవారం తీర్పు వెల్లడించింది. జిల్లా ఎస్పీ శ్రీనివాస్‌రావు కథనం ప్రకారం.. ఓ హాస్టల్‌లో ఉండే బాలికను కుటుంబీకులు 2025 అక్టోబర్‌ 14న తూప్రాన్‌లో బస్సు ఎక్కించారు. చేగుంటలో బస్సు దిగిన బాలిక తనకు తెలిసిన ఆనంద్‌ అనే యువకుడికి ఫోన్‌ చేసి హాస్టల్‌ వద్ద దింపాలని కోరింది. ఆనంద్‌ బాలికకు మాయమాటలు చెప్పి హాస్టల్‌లో దింపకుండా తనతో ఉంటే బాగా చూసుకుంటానని మేడ్చల్‌కు, అక్కడి నుంచి నిజామాబాద్‌కు, మరునాడు సికింద్రాబాద్‌కు తీసుకెళ్లాడు. కాగా బంధువుల సూచనతో ఆనంద్‌ బాలికను తిరిగి ఇంటికి పంపించే ప్రయత్నం చేశాడు. కానీ, అప్పటికే మిస్సింగ్‌ కేసు నమోదు చేసిన తూప్రాన్‌ పోలీసులు బాలికను గుర్తించి దర్యాప్తు పూర్తి చేశారు. బాలికను నమ్మించి అపహరణకు గురిచేయడం, మోసం చేయడం, పోక్సో కేసుకు సంబంధించిన అంశాలపై దర్యాప్తు అధికారి ఎస్‌ఐ జ్యోతి, పీపీ బాలయ్య సాక్ష్యాధారాలను కోర్టులో ప్రవేశపెట్టారు. పరిశీలించిన జిల్లా ఫాస్ట్‌ట్రాక్‌ పోక్సో కోర్టు న్యాయమూర్తి శుభవల్లి నిందితుడికి ఏడేళ్ల జైలుశిక్ష, రూ.30 వేల జరిమానా విధిస్తూ తీర్పునిచ్చారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement