కొల్చారం(నర్సాపూర్): మంజీరా నదిలో దూకి తల్లి, ఇద్దరు కూతుళ్లు గల్లంతయ్యారు. ఈ ఘటన మెదక్ జిల్లా కొల్చారం మండలంలోని పోతంశెట్టిపల్లి గ్రామ శివారు ఏడుపాయలకు వెళ్లే మొదటి బ్రిడ్జి వద్ద మంగళవారం చోటుచేసుకుంది. ఎస్ఐ.హైమద్ మోహినుద్దీన్ వివరాల ప్రకారం.. కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి మండలం మల్కాపూర్ గ్రామానికి చెందిన గంగుల సరిత తన ఇద్దరు కూతుళ్లు వైష్ణవి, శ్రావణికతో కలిసి ఏడుపాయలకు వచ్చారు. సరిత తాను చనిపోతున్నట్లు తండ్రి బాలకృష్ణయ్యకు ఫోన్ చేసి చెప్పింది. కుటుంబ సభ్యుల సమాచారంతో మెదక్ రూరల్ ఎస్ఐ శ్రీ కృష్ణమూర్తి, సిబ్బందితో కలిసి సరిత మొబైల్ లొకేషన్ ఆధారంగా నది వెంట గాలించారు. ఈ క్రమంలో మొదటి బ్రిడ్జి నది ఒడ్డున ఫోన్, తల్లి కూతుర్లకు సంబంధించి ఆధార్ కార్డులు, చెప్పులు పోలీసులకు కనిపించాయి. దీంతో మెదక్ నుంచి ఫైర్ సిబ్బందిని రప్పించి గాలింపు చర్యలు చేపట్టారు. ఎలాంటి ఆచూకీ లభించలేదు. అప్పటికే చీకటి పడడంతో గాలింపును నిలిపివేశారు. బుధవారం ఉదయం మరోసారి గాలింపు చర్యలు చేపడతామని ఎస్ఐ తెలిపారు. అయితే సరిత భర్త చనిపోవడంతో పిల్లలతో పాటు హైదరాబాదులో ఒంటరిగా ఉంటూ సెక్యూరిటీ గార్డుగా పనిచేస్తున్నట్టు తెలిసింది. నదిలో దూకడానికి గల కారణాలు తెలియాల్సి ఉంది.
కామారెడ్డి జిల్లాకు చెందిన వారిగా గుర్తింపు
గాలింపు చేపట్టిన గజ ఈతగాళ్లు


