మిరుదొడ్డి(దుబ్బాక): కందిరీగల దాడిలో ఏడుగురికి గాయాలైన ఘటన మండల కేంద్రమైన మిరుదొడ్డిలో మంగళవారం చోటు చేసుకుంది. వివరాలు ఇలా.. స్థానిక ప్రభుత్వ జూనియర్ కళాశాల సమీపంలో కందిరీగలు విద్యార్థులపై అకస్మాత్తుగా దాడి చేశాయి. అందులో ఐదుగురు విద్యార్థులతో పాటు, ఒక లెక్చరర్‌కు, అటుగా వెళ్తున్న ఓ రైతుపై కందిరీగలు దాడి చేశాయి. స్థానికులు గాయపడ్డ వారిని స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
విద్యుత్ షాక్‌తో నలుగురు కూలీలకు..
హుస్నాబాద్‌రూరల్: ఇందిరమ్మ ఇల్లు నిర్మాణ పనులు చేస్తుండగా విద్యుదాఘాతంతో నలుగురు కూలీలు తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటన మంగళవారం మండలంలోని మహ్మదాపూర్‌లో చోటు చేసుకుంది. స్థానికుల కథనం ప్రకారం.. మిట్టపెల్లి రాజబాబుకు ఇందిరమ్మ ఇల్లు మంజూరు కావడంతో కూలీలతో పనులు చేయిస్తున్నాడు. స్లాబ్‌పై కూలీలు గోడ పనులు చేస్తున్న క్రమంలో ఒకరు ఇనుప రాడును పైకి ఎత్తగా అది సమీపంలోనే ఉన్న 11 కేవీ విద్యుత్ వైర్లకు తగిలి విద్యుత్ షాక్ కొట్టింది. ఇనుప రాడును పట్టుకున్న కల్లూరి రాధ, కుంచం సంతోష్, కత్తుల రజిత, సిర్ర రాజులు షాకుకు గురై గాయపడ్డారు. 108లో ప్రభుత్వ అస్పత్రికి తరలించారు. మెరుగైన వైద్యం కోసం వరంగల్ ఎంజీఎంకు తరలించగా, కల్లూరి రాధ పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు.


