సాక్షిప్రతినిధి, సంగారెడ్డి/నారాయణఖేడ్: జిల్లా అంతటా కరువు నెలకొన్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. జిల్లాలో మొత్తం 28 రెవెన్యూ మండలాలను కరువు మండలాలుగా తేల్చింది. జహీరాబాద్, కోహీర్ మండలాల్లో అత్యంత క్షామ పరిస్థితులు నెలకొన్నాయని గుర్తించింది. రాష్ట్ర వ్యాప్తంగా 365 మండలాలను ప్రభుత్వం కరువు మండలాలుగా ప్రకటిస్తూ జీఓనం.3ను జారీ చేసింది. ఇందులో సంగారెడ్డి జిల్లాకు సంబందించి 28 మండలాలు ఉన్నాయి. ప్రభుత్వం ఈ మేరకు కరువు మండలాలను గుర్తించింది. మనూరు, రాయికోడ్, న్యాల్‌కల్, మొగుడంపల్లి, మునిపల్లి, ఆందోల్, పుల్కల్, హత్నూర, జిన్నారం, అమీన్‌పూర్, ఝరాసంగం, నాగల్‌గిద్ద, పటాన్‌చెరు, సదాశివపేట, వట్‌పల్లి, గుమ్మడిదల, కంది, సంగారెడ్డి, ఆర్సీపురం, కల్హేర్, కంగ్టి, కొండాపూర్ , సిర్గాపూర్, నారాయణఖేడ్, నిజాంపేట, చౌటకూర్ మండలాలు కరువు మండలాల జాబితాలో ఉన్నాయి.
ఆదుకొనే దిశగా...
పంట నష్టం అంచనా, చిన్న రైతులు నష్టపోకుండా చూడటం, సాధారణ వర్షపాతం కంటే తక్కువ కురిసిన మండలాలు, భూగర్భ జలాలు పడిపోయిన ప్రాంతాలు, విత్తనాలు విత్తి పంటలు ఎండిపోయిన ఎకరాలు ఇలా అన్ని అంశాలను సమగ్రంగా అధికారులు సేకరించారు. ఎల్‌నినో ప్రభావం 20% ఉన్న మండలాలను కూడా ప్రభావిత మండలాలుగా పరిగణించాలని అధికారులు నిర్ధారించారు. కేంద్రం 33% కంటే అధికంగా పంట నష్టం జరిగిన మండలాలను కరువు మండలాలుగా గుర్తిస్తుంది. ప్రస్తుతం 20% దెబ్బతింటే మున్ముందు పూర్తిస్థాయిలో దిగుబడులు వచ్చే అవకాశాలు ఏమాత్రం లేవని అధికారులు అంచనాలకు వచ్చారు. స్వల్పంగా, అధికంగా నష్టపోయిన మండలాలన్నింటినీ గుర్తించి ఆయా మండలాల రైతులకు ఉపాధిహామీ పనులు, విత్తన రాయితీ, అప్పుల పునర్వ్యవస్థీకరణ వంటి ప్రయోజనాలు అందేలా అధికారులు ప్రయత్నిస్తున్నారు. జాతీయ విపత్తు నిర్వహణ నిధి నుంచి భారీగా నిధులు సమీకరించేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తుండగా అందుకనుగుణంగా జిల్లాకు ప్రయోజనం చేకూరేందుకు అధికారులు కార్యాచరణ రూపొందిస్తున్నారు. కరువు ప్రభావిత మండలాల్లో పనిదినాలు 100 నుంచి 150 రోజులకు పెంచేలా కేంద్రం అనుమతులు ఇప్పటికే రాష్ట్రం కోరింది. పరిస్థితి మరింత దిగజారక ముందే ప్రతీ మండలానికి సమగ్ర కార్యాచరణ ప్రణాళికను సిద్ధం చేసుకోవాలని ప్రభుత్వం జిల్లా అధికారులకు ఆదేశించింది.
ఇలా కరువు నిర్ధారణ
వర్షపాతం, మెట్రాలాజికల్, డ్రై స్పెల్, రిమోట్ సెన్సింగ్, వ్యవసాయశాఖ, హైడ్రాలాజికల్, నేల తేమ, భూగర్భజలాలు, స్ట్రీమ్ ఫ్లో, సామాజిక ఆర్థికాభివృద్ధి, తదితర 12 అంశాల ఆధారంగా అధికారులు కరువును నిర్ధారిస్తారు. ఈ అంశాల ఆధారంగా జిల్లా మొత్తం కరువు నెలకొన్నట్లు ప్రభుత్వానికి నివేదించారు. జిల్లాలో జూన్ నుంచి సెప్టెంబర్ వరకు నాలుగు నెలల్లో 658.04 మి.మీ వర్షపాతం కురవాల్సి ఉండగా 561.8 మి.మీ మాత్రమే నమోదైంది. 97 మి.మీ లోటు వర్షపాతం కురిసింది.


