ఎమ్మెల్యే చింతా ప్రభాకర్
సంగారెడ్డి: ప్రజలు తాగునీటి కొరతతో ఇబ్బందులు పడుతుంటే, వ్యవసాయ బోర్ల నుంచి ట్యాంకర్ల ద్వారా పరిశ్రమలకు నీటిని తరలించడంపై అధికారులు చర్యలు తీసుకోవాలని బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ డిమాండ్ చేశారు. సంగారెడ్డిలో మంగళవారం నిర్వహించిన ఉమ్మడి మెదక్ జిల్లా సమీక్ష సమావేశంలో ఆయన ఈ అంశాన్ని ప్రస్తావించారు. ఉచిత వ్యవసాయ విద్యుత్‌తో బోర్ల నుంచి నీటిని తోడి పరిశ్రమలకు సరఫరా చేస్తున్నారనే ఆరోపణలపై సమగ్ర విచారణ జరిపించాలని కోరారు. ఎల్‌నినో ప్రభావంతో వర్షాలు తగ్గే అవకాశమున్నందున, వేసవిలో తాగునీటి సమస్య తలెత్తకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని సూచించారు. మునిదేవునిపల్లి ప్రాంతంలో భూసేకరణ పరిహారం అందని రైతులను గుర్తించి న్యాయం చేయాలని, దళారుల వేధింపులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.


