వాడిపోతున్న ఆశలు | - | Sakshi
Sakshi News home page

వాడిపోతున్న ఆశలు

Oct 27 2026 8:28 AM | Updated on Oct 27 2026 8:28 AM

● ఒక వైపు కరెంట్‌ కోతలు.. మరో వైపు వర్షాభావ పరిస్థితులు

● పంటలను కాపాడుకునేందుకు పాట్లు

● ఆందోళనలో రైతాంగం

న్యాల్‌కల్‌(జహీరాబాద్‌): ఒక పక్క విద్యుత్‌ సమస్య, మరో పక్క వర్షాభావ పరిస్థితుల కారణంగా రైతులు సాగు చేసిన పంటలు దెబ్బతింటున్నాయి. పంటలను కాపాడుకునేందుకు నానా ఇబ్బందులు పడుతున్నారు. బోరు బావుల సౌకర్యం ఉన్న రైతులు పంట పొలాలకు విద్యుత్‌ మోటార్ల ద్వారా నీటిని అందిస్తుండగా, ఆ సౌకర్యం లేని రైతులు డబ్బులు వెచ్చించి వాటర్‌ ట్యాంకర్ల ద్వారా నీటి తడులు అందిస్తూ పంటలను కాపాడుకుంటున్నారు. ప్రస్తుతం పత్తి చేతికి వస్తుండగా పూత, కాత దశలో ఉన్న కంది పంటను కాపాడుకునేందుకు నానా అవస్థలు పడుతున్నారు.

7,03,610 ఎకరాల్లో పంటలు

ఈ ఏడాది జిల్లాలో 7,03,610 ఎకరాల్లో రైతులు వివిధ పంటలు సాగు చేశారు. అత్యధికంగా 3,57,246 ఎకరాల్లో పత్తి, 1,22,118 ఎకరాల్లో వరి, 75,068 ఎకరాల్లో కంది సాగు కాగా, మిగిలిన 1,49,178 ఎకరాల్లో ఇతర పంటలు వేశారు. మొదట్లో పంటలు ఆశాజనకంగా ఉన్నా, ఆగస్టు 15 నుంచి వర్షాల జాడ లేకపోవడంతో దెబ్బతిన్నాయి. ప్రస్తుతం చేతికి వస్తున్న పత్తి పంట దిగుబడి గణనీయంగా తగ్గింది. 75 వేలకు పైగా ఎకరాల్లో సాగు చేసిన కంది పంట వర్షాభావ పరిస్థితుల కారణంగా తీవ్రంగా దెబ్బతింది. మినుము, పెసర, సోయా చిక్కుడు తదితర పంటల్లో మిశ్రమ పంటగా సాగు చేసుకున్న కంది పంట నేలలో తేమ లేక దెబ్బతింటుంది. ప్రస్తుతం పూత, కాత దశలో ఉన్న కంది పంటకు నీరు అవసరం. ఐతే చాలా రోజులుగా వర్షాలు జాడ లేకపోవడంతో పూత రాలుతుందని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. బోరు బావులు అందుబాటులో ఉన్న రైతులు పంటకు నీటి తడులు అందిస్తూ పంటలను కాపాడుకుంటున్నారు. లోఓల్టేజీ కారణంగా పంటలకు నీటి తడులు కూడా సరిగా అందించలేకపోతున్నామని వాపోతున్నారు. బోరు బావుల సౌకర్యం లేని రైతులు వాటర్‌ ట్యాంకర్ల ద్వారా నీటిని అందిస్తున్నారు. అయితే తుఫాన్‌ ప్రభావంతో వర్షం పడితే కొంత మేర ప్రయోజనం చేకూరనుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement