ఎమ్మెల్యే సునీతారెడ్డి
హత్నూర(సంగారెడ్డి): పంట నష్టపోయిన రైతులకు ఎకరాకు రూ.30 వేల చొప్పున ప్రభుత్వం నష్టపరిహారం అందించాలని ఎమ్మెల్యే సునీతారెడ్డి డిమాండ్ చేశారు. సోమవారం హత్నూర, నవాబుపేట, చిక్‌మద్దూర్, సిరిపుర, గోవిందరాజ్ పల్లి, లింగాపూర్, దౌల్తాబాద్, దౌలాపూర్, కాసాలతో పాటు పలు గ్రామాలలో ఏర్పాటుచేసిన కొనుగోలు కేంద్రాలను ఎమ్మెల్యే ప్రారంభించి మాట్లాడారు. రైతులకు నాణ్యమైన విద్యుత్ అందించకపోవడం వల్ల పంటలు ఎండిపోయి రైతులు ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. యాసంగి పంట వేయొద్దని చెబుతున్న ప్రభుత్వం, రైతులను ఆదుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. కొనుగోలు కేంద్రాలకు ధాన్యం తీసుకువచ్చి రోజులు గడిచినా కొనుగోలు చేయడం లేదన్నారు. అంతేకాకుండా కొన్నిచోట్ల తూకంలో మోసాలు చేయడంతో రైతులు నష్టపోతున్నారని వాపోయారు. ప్రస్తుతం వరి కోతలు ప్రారంభం అవుతుండటంతో ఇప్పటికై నా ప్రభుత్వం ముందుచూపుతో పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని తెలిపారు. వెంట వెంటనే ధాన్యం కొనుగోలు చేయాలన్నారు. రైతు భరోసా అమలు చేయడంలో ప్రభుత్వం విఫలమైందని ఆరోపించారు. కార్యక్రమంలో పీఏసీఎస్ చైర్మన్ దుర్గారెడ్డి, తహసీల్దార్ పర్వీన్ షేక్, ఏపీఎం రాజశేఖర్, సొసైటీ సీఈఓ శ్రీనివాస్, మాజీ ఎంపీపీలు నర్సింలు, ఆంజనేయులు, బీఆర్‌ఎస్ మండలాధ్యక్షుడు రామచంద్రారెడ్డి, ఆయా గ్రామాల సర్పంచ్‌లు, ఐకేపీ, పీఏసీఎస్ సిబ్బంది పాల్గొన్నారు.


