యాసంగికి ఎల్‌నినో ముప్పు | - | Sakshi
Sakshi News home page

యాసంగికి ఎల్‌నినో ముప్పు

Oct 27 2026 8:22 AM | Updated on Oct 27 2026 8:22 AM

96,344 ఎకరాల్లో మాత్రమే సాగు అంచనా వరి, నీటి వినియోగం పంటలకు క్రాప్‌ హాలీడే అడుగంటుతున్న భూగర్భ జలాలు 8 కరువు మండలాల గుర్తింపు

ఎల్‌నినో ప్రభావంతో యాసంగి సాగుపై నీలినీడలు అలుముకున్నాయి. వరితో పాటు అధిక నీటి వినియోగం ఉన్న పంటలకు రాష్ట్ర ప్రభుత్వం క్రాప్‌ హాలీడే ప్రకటించిన నేపథ్యంలో ఈ యాసంగిలో వరి సాగు చేయవద్దని, అధికారులు చెబుతున్నారు. కాగా మొత్తం సిద్దిపేట జిల్లాలో 96,344 ఎకరాల్లో మాత్రమే సాగు అవ్వనున్నట్లు, వ్యవసాయశాఖ అధికారులు యాసంగి ప్రణాళికను రూపొందించారు.

– ప్రశాంత్‌నగర్‌(సిద్దిపేట)

ఇప్పటికే జిల్లాలో వానాకాలం సాగు చివరి దశకు చేరుకున్న నేపథ్యంలో ఆఖరు తడికి నీరు సక్రమంగా అందని పరిస్థితులు నెలకొన్నాయి. దీంతో రైతులు ఇబ్బందులు పడుతున్నారు. వానాకాలం ప్రారంభం నుంచే ఆశించిన వర్షాలు కురవలేదు. దీంతో చెరువులు, కుంటల్లో నీరు లేకపోవడంతో భూగర్భ జలాలు అడుగంటుతున్నాయి. దౌల్తాబాద్‌, రాయపోల్‌, ములుగు మండలాల్లో భూగర్భ జల మట్టాలు వేగంగా పడిపోతున్నట్లు అధికారులు పేర్కొన్నారు. ఇప్పుడే పరిస్థితి ఇలా ఉంటే మార్చి, ఏప్రిల్‌ నాటికి నీటి, విద్యుత్‌ కష్టాలు భారీగా ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి. దీంతో యాసంగి సాగుపై రైతుల్లో అనిశ్చితి నెలకొంది.

యాసంగి సాగు అంచనా..

ఎల్‌నినో ప్రభావంతో సిద్దిపేట జిల్లాలో నీటి వినియోగం తక్కువగా ఉండే తృణధాన్యాలు, నూనె దినుసులు సాగు చేయాలని, రైతులకు అధికారులు అవగాహన కల్పిస్తున్నారు. గత 2025 – 26 యాసంగిలో 4,12,039 ఎకరాల్లో సాగు అవ్వగా, 2026–27 యాసంగిలో 96,344 ఎకరాల్లో సాగవుతుందని వ్యవసాయశాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. ఇందులో ముఖ్యంగా గత యాసంగిలో 3,55,501 ఎకరాల్లో గరిష్టంగా వరి సాగయ్యింది. కాగా ఈ యాసంగిలో అధికంగా 62,921 ఎకరాల్లో మొక్కజొన్న , 22,325 ఎకరాల్లో పొద్దుతిరుగుడు, 11,098 ఎకరాల్లో చిరుధాన్యాలు, నూనె దినుసులు మొత్తం 96,344 ఎకరాల్లో మాత్రమే సాగు అవ్వనున్నట్లు, వ్యవసాయశాఖ అధికారులు యాసంగి ప్రణాళికను రూపొందించారు.

8 కరువు మండలాల గుర్తింపు

ఎల్‌నినో ప్రభావంతో జిల్లాలోని అనేక మండలాలు ఇప్పటికే ప్రభావితం అవుతున్నాయి. దీంతో జిల్లాలో అధికారులు 10 అంశాలతో కూడిన సర్వే నిర్వహించారు. ఇందులో కొమురవెల్లి తీవ్ర కరువు మండలంగా ఉండగా చేర్యాల, ధూళ్మిట్ట, బెజ్జంకి, నారాయణరావుపేట, ములుగు, వర్గల్‌, మర్కూక్‌ మండలాల్లో కరువు ప్రభావం ఉందని ప్రభుత్వం గుర్తించింది.

సిద్దిపేట జిల్లాలో సాగుకు ప్రతికూలం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement