రూ.15 లక్షల ఆస్తినష్టం
అల్లాదుర్గం(మెదక్): దాబాలో భారీ అగ్ని ప్రమాదం సంభవించి రూ.15 లక్షల ఆస్తి నష్టం జరిగింది. ఈ ఘటన మండలంలోని గడిపెద్దాపూర్ గ్రామ శివారులో సోమవారం చోటు చేసుకుంది. దాబా యజమాని రవిచంద్ర వివరాల ప్రకారం.. గడిపెద్దాపూర్ శివారులో 161 జాతీయ రహదారి పక్కన ఫ్యామిలీ రెస్టారెంట్ (దాబా)లో ప్రమాదవశాత్తు మంటలు చెలరేగాయి. దీంతో అక్కడున్న వర్కర్లు, దాబాకు వచ్చిన వారు గమనించి పరుగులు పెట్టారు. భారీగా ఎగిసి పడుతున్న మంటలను ఆర్పేందుకు స్థానికులు ఎంత ప్రయత్నించినా అదుపులోకి రాలేదు. దీంతో జోగిపేట అగ్నిమాపక కేంద్రానికి సమాచారం అందించగా, వారు వచ్చే సరికి భారీ నష్టం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదు. రూ.15 లక్షల మేర ఆస్తి నష్టం జరిగినట్లు బాధితుడు తెలిపారు.


